పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది.. మళ్లీ ఛలో హైదరాబాదా? జీవీఎల్ ప్రశ్నలు

ఠాగూర్

గురువారం, 15 ఫిబ్రవరి 2024 (10:49 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ళ పాటు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉన్నదని, ఆ పదేళ్లకాలంలో ఒక్కటంటే ఒక్క రోజును కూడా రాజధానిని ఉపయోగించుకున్న దాఖలాలు లేవని, ఇపుడు మళ్లీ ఛలో హైదరాబాద్ అంటూ కొత్త రాగం అందుకోవడం విచిత్రంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు. 
 
హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా ఇంకొన్నాళ్లు కొనసాగించాలని వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ గడువు జూన్‌తో ముగియనుంది. నాటి టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత వైసీపీ సర్కారు హైదరాబాదులోని కార్యాలయాలన్నింటినీ తెలంగాణ సర్కారుకు అప్పగించింది. తదనంతరం, ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించింది. ఇప్పుడు వైవీ వ్యాఖ్యలతో మరోసారి హైదరాబాద్ రాజధాని అంశం తెరపైకి వచ్చిందన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని బీజేపీ చెబుతోందన్నారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ కావాలి అని పిలుపునిచ్చారు. వేరే రాష్ట్రం నుంచి రాజధానిని తీసుకోవాల్సిన అగత్యం ఏపీకి లేదని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఇస్తే దాన్ని ఒక్క రోజు కూడా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు... మళ్లీ ఛలో హైదరాబాద్ అని ఎందుకంటున్నారని జీవీఎల్ విమర్శించారు. సొంత రాజధాని నిర్మించుకోలేకపోయిందన్న అప్రదిష్ట ఏపీకి ఎందుకు? మళ్లీ వెళ్లి పక్క రాష్ట్రంపై ఆధారపడతామనడం సబబేనా? అని జీవీఎల్ నరసింహా రావు ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు