స్పీకర్ పదవికి శుభం కార్డు? సీఎం అలా ఆలోచన చేస్తున్నారు?

శనివారం, 25 జులై 2020 (16:06 IST)
ఆయన మంత్రి పదవి రేసులోకి వచ్చేశారా? ఇన్నాళ్ళు అధ్యక్షా అని పిలిపించుకున్న ఆయన ఇప్పుడు అమాత్యా అని పిలిపించుకోవాలని ఇష్టపడుతున్నారా.. ఇంతకీ కేబినెట్ లోకి వెళ్ళేందుకు తమ్మినేని సీతారాంకు కలిసొస్తున్న అంశాలేంటి?
 
ఎపి కేబినెట్ ప్రస్తుతానికి కొత్తవారిని తీసుకున్నారు. కానీ ఆ తరువాత మళ్ళీ కొత్త వారిని తీసుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారట. ఇందులో ప్రముఖంగా సీతారాం పేరు వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యే అయిన తమ్మినేని సీతారాం గతంలోనే మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు.
 
అనుకోకుండా స్పీకర్ పదవి వచ్చినా సర్దుకుపోయారు. చాలారోజుల నుంచి తమ్మినేనని స్పీకర్ పదవి నుంచి తప్పించి మంత్రిని చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఆయన కూడా అమాత్య అనిపించుకోవడానికి బాగా ఆశపడుతున్నారట. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై తమ్మినేని కౌంటర్ అటాక్‌కు బాగా ఉపయోగపడతారన్న ఆలోచనలో సిఎం ఉన్నారట.
 
బిసి కార్డు వాడుతున్న టిడిపికి ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి తమ్మినేని బాగా ఉపయోగపడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. తమ్మినేని సభాపతి స్థానంలో ఉన్నా తన సహజసిద్థమైన దూకుడును ఆపుకోలేకపోతున్నారు. దీంతో టిడిపి సభ్యులు నేరుగా తమ్మినేనితో మాటల యుద్ధానికి దిగుతున్నారు. 
 
ఇలాంటి సమయంలో తమ్మినేనిని మంత్రిని చేస్తే ఫైర్ బ్రాండ్‌గా దూసుకుపోతారని.. అసెంబ్లీలోకి అడుగుపెడితే విపక్షాన్ని వణికిస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. అందుకే మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే సమయంలో తమ్మినేని సీతారాంను మంత్రిగా తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట సిఎం. మరి చూడాలి... స్పీకర్‌గా తనకు బాగుందో లేకుంటే మంత్రి పదవిని తీసుకోవడానికి తమ్మినేని ఇష్టపడతారో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు