జగన్‌ రాజీనామా చేయాలి : చంద్రబాబు డిమాండ్

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:28 IST)
ఏపీ సీఎం జగన్‌ రాజీనామా చేయాలని విపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయ పరీక్ష లీకేజీ వ్యవహారానికి బాధ్యతవహించి పదవి నుంచి తప్పుకోవాలన్నారు.

సీఎం రాజీనామా చేస్తారో లేక పంచాయితీరాజ్, విద్యాశాఖ మంత్రులే రాజీనామా చేస్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. జరిగిన అవినీతి, అక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేని చంద్రబాబు అన్నారు. ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
 
బాధ్యులైన కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. గ్రామ సచివాలయ పరీక్ష నిర్వహణ అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. గత నాలుగు నెలలుగా జరిగిన పరిణామాలన్నీ ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

శాఖలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అనుక్షణం అప్రమత్తతతో ఉండాలని ప్రభుత్వ పెద్దలకు సూచించారు చంద్రబాబు. పరిపాలనకు అనుభవం ఎంత అవసరమో, కార్యదక్షత కూడా అంతే ముఖ్యమన్నారు.

4 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు, ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు.. సీఎం అనుభవ రాహిత్యం, చేతకానితనమే కారణమన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు