టీడీపీని తక్కువ అంచనా వేయొద్దు.. అందుకే పొత్తు పెట్టుకున్నాను : పవన్ కళ్యాణ్

సోమవారం, 2 అక్టోబరు 2023 (19:14 IST)
అధికార వైకాపాతో పాటు తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేయొద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన తన నాలుగో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా, సోమవారం మచిలీపట్నంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. 
 
'పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు పుట్టిన నేల ఇది. దుబాయ్‌ వంటి చోట్ల మూడింట రెండొంతులు భారతీయులే ఉంటారు. కులాల ఐక్యత గురించి నేను పదే పదే చెబుతాను. ఏ ఒక్క కులం వల్లో అధికారం రాదని గుర్తించాలి. కాపు కులంలో పుట్టినా.. నేను అన్నింటినీ సమదృష్టితో చూసే వ్యక్తిని. నేను కులాలను వెదుక్కొని స్నేహాలు చేయను. వైకాపా కీలక పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఒక కులానికి మరో కులం పట్ల ఎందుకు ద్వేషం ఉండాలి?
 
సామాజిక వెనుకబాటును ఎలా రూపుమాపాలా అని అందరూ ఆలోచించాలి. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. లేచిందే లేడికి పరుగు అన్నట్లు.. పార్టీ పెట్టగానే అధికారం రాదు. పార్టీ పెట్టగానే అధికారం అందుకోవడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. జనసేన విశాలభావం ఉన్న పార్టీ.. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుంది' అని పవన్‌ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు