ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజు

శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:57 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును ప్రభుత్వం నియమించింది. ఈయన మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కనగరాజు వ్యవహరించారు.

కాగా.. స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన్ను తొలగించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఇప్పటిదాకా రిటైర్డ్‌ ఐఏఎస్‌లకు అప్పగిస్తున్న ఆ పదవిలో.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలను నియమించేలా మరో మార్పు తీసుకొచ్చింది. 
 
శుక్రవారం ఆన్‌లైన్‌లో రాష్ట్ర మంత్రులతో కేబినెట్‌ సమావేశం నిర్వహించి.. ఆర్డినెన్స్‌పై ఆమోద ముద్ర పొందింది. ఆ వెంటనే దీనిని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపింది. గవర్నర్‌ కూడా దీనిని ఆమోదించారు. ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఆమోద ముద్ర పడగానే.. చకచకా మూడు జీవోలు వెలువడ్డాయి.

పంచాయతీరాజ్‌ శాఖ, న్యాయశాఖల్లో గ్రామీణ ఎన్నికలకు సంబంధించి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్డినెన్స్‌ను అమలులోకి తెస్తూ ఒక జీవో జారీ చేశారు. ఆ తర్వాత... ఆర్డినెన్స్‌కు అనుగుణంగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ జీవో నెంబరు 617 జారీ చేయడం జరిగింది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు