ప్రణయ్ హత్య కేసు.. అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

ఆదివారం, 8 మార్చి 2020 (09:50 IST)
Maruthi Rao
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమార్తె అమృత ప్రేమించి వివాహం చేసుకున్న ప్రణయ్‌ని దారుణంగా హతమార్చేందుకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు ఖైరతాబాద్‌లోని వాసవీ భవన్‌లో గత రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
చింతల్‌బస్తీలో ఉన్న ఈ భవన్‌లో మారుతీరావు శనివారమే గదిని అద్దెకు తీసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. అలా ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలో పడివున్న మారుతీరావును చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
 
కాగా, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి అయిన మారుతీరావు.. ప్రణయ్ హత్యకేసుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తన కుమార్తె అమృత అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. 
 
ఈ క్రమంలో మారుతీరావు 2018లో ప్రణయ్‌ను హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన మారుతీరావు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. బెయిల్‌పై వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడటం వివాదాస్పదమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు