సోదరుడి భార్యపై పిడిగుద్దులు... జుట్టుపట్టిలాగి.. కాళ్లతో తన్ని... వైకాపా నేత దాష్టీకం

మంగళవారం, 16 మే 2023 (08:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతలు అధికార బలంతో రెచ్చిపోతున్నారు. తాజాగా ఉమ్మడి ఆస్తి విషయంలో తలెత్తిన వివాదంలో సోదరుడి భార్యపై వైకాపా నేత దాష్టీకం ప్రదర్శించారు. నంద్యాలి జిల్లాలో వైకాపా నేత ఒకరు ఒక మహిళపై తన కండబలం ప్రదర్శించాడు. జుట్టు పట్టుకుని లాగి ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా విచక్షణా రహితంగా ప్రదర్శించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలంలోని రాంపల్లె గ్రామంలో జరిగింది. 
 
బాధితురాలి కథనం మేరకు.. రాంపల్లె గ్రామానికి చెందిన పార్వతమ్మ, ఉసేన్ రెడ్డి అనే దంపతులకు రఘునాథ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, వీరికి ఉన్న వ్యవ సాయి భూమిని పిల్లలకు పంచకుండానే కుటుంబ పెద్ద పార్వతమ్మ మృతి చెందారు. దీంతో ఆమె పేరుపై ఉన్న 20 ఎకరాల పొలం గత కొంతకాలంగా వివాదంగా మారింది. 
 
ఈ పొలంపై మాజీ ఎంపీపీ, వైసీపీ నాయకుడు రఘునాథరెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి భార్య ప్రభావతమ్మ కోర్టులో కేసు వేశారు. కానీ, ఈ కేసు విషయం పట్టించుకోకుండా 20 ఎకరాల భూమిని తన ఆధీనంలో ఉంచుకోవాలని రఘునాథ రెడ్డి భావించారు. ఏడుగురు సంతానంలో నలుగురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. వారికి వచ్చే వాటా పొలాన్నయినా తాను కౌలుకు చేసుకుంటానని చెప్పి, మిగిలిన వారిని ప్రభావతమ్మ ఒప్పించారు. 
 
ఈ క్రమంలో పొలం సాగు చేసుకునేందుకు సోమవారం ఆమె వెళ్లారు. పొలం పనులు చేసుకుంటున్న సమయంలో విషయం తెలుసుకున్న రఘునాథ రెడ్డి అక్కడకు చేరుకుని ఆమెను దుర్భాషలాడుతూ జుట్టుపట్టుకుని పొలంలోంచి బయటకు లాక్కొచ్చి పిడిగుద్దులు కురిపించారు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రభావతమ్మ స్పృహ కోల్పోయారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఐ రమణయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రఘునాథ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభావతమ్మను ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. రఘునాథ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి