సీఆర్టీలకు సెలవుల్లోనూ వేతనాలు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

బుధవారం, 20 మే 2020 (08:42 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు సెలవురోజుల్లోనూ వేతనాలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు.

గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ) లకు ఇప్పటివరకు వారు పనిచేస్తున్న కాలానికి మాత్రమే వేతనాలను చెల్లిస్తున్నామని పుష్ప శ్రీవాణి మంగళవారం మీడియా కు విడుదలచేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యాసంస్థలకు చివరి పనిదినమైన ఏప్రిల్ 23 వ తేదివరకు మాత్రమే సీఆర్టీల పనిదినాలను పరిగణలోకి తీసుకోవడం జరిగేదని చెప్పారు. ఈ కారణంగా ఏప్రిల్ 23 నుంచి మళ్లీ విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యే జూన్ 12 దాకా వారికి వేతనాలను ఇచ్చేవారు కాదని తెలిపారు.

అయితే తమకు సెలవు కాలంలోనూ వేతనాలివ్వాలంటూ సీఆర్టీలు చేసిన విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఇక నుంచి సీఆర్టీలకు వారి సర్వీసు నిబంధనల ప్రకారంగా పది రోజులు మినహాయించి మిగిలిన మొత్తం కాలానికి వేతనాలను చెల్లించనున్నామని వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని పుష్ప శ్రీవాణి వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు