రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని ఉద్యమం

సోమవారం, 6 జనవరి 2020 (08:51 IST)
రాజధాని ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరమవుతోంది. ఇప్పటి వరకూ అమరావతికే పరిమితమైన ఈ ఉద్యమం ఇప్పుడు నలువైపులా విస్తరిస్తోంది. రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 
 
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం ప్రసాదంపాడు ఎస్‌ఈఆర్‌ సెంటర్లో ‘వంటా-వార్పు’ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని), జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ధర్నాచౌక్‌లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

ఆదివారం డాక్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు దీక్ష చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని నాని, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అమరావతి జేఏసీ నాయకులు రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఆధ్వర్యాన పోరంకి సెంటర్‌లో చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.

వణుకూరు గ్రామానికి చెందిన రైతులు, మహిళలు, జేఏసీ నాయకులు ఆదివారం దీక్షలను కొనసాగించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. గొల్లపూడి అపార్ట్‌మెంట్‌ వాసులు, రైతులు, టీడీపీ నాయకులు ఆదివారం దీక్ష చేశారు. సోమవారం నగరంలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి.
 
నాడు త్యాగాలు.. నేడు పోరాటాలు
రాజధాని అమరావతి కోసం ఆనాడు త్యాగాలు చేసిన రైతులు నేడు పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యాన సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌... సేవ్‌ అమరావతి... పేరుతో ధర్నా చౌక్‌లో చేస్తున్న నిరసనలో ఆదివారం ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఆయన మాట్లాడుతూ రాజధాని తరలింపు 29 గ్రామాల సమస్య కాదని రాష్ట్ర ప్రజలందరి సమస్య అన్నారు. రాజధాని మార్పు సీఎం పరిధిలోని అంశం కాదన్నారు. అమరావతి రాజధానిగా కావాలో వద్దో కృష్ణా, గుంటూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ మాట్లాడుతూ మాట మార్చను... మడమ తిప్పను అని చెప్పే జగన్‌ రాజధాని విషయంలో మాట మార్చారని ఎద్దేవా చేశారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ప్రకటించిన లక్ష రూపాయల చెక్కును ఆమె అందజేశారు. జేఏసీ నాయకులు, డాక్టర్లు పాల్గొన్నారు.
 
మద్దతుగా విశాఖ వాసులు
రాజధానిగా అమరావతినే కొనసాగిం చాలని అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలకు మద్దతుగా విశాఖ నివాసి వీఆర్కే ప్రసాద్‌ స్నేహితులతో వచ్చి ధర్నా చౌక్‌లో జరుగుతున్న నిరసనలో పాల్గొని మద్దతు తెలిపారు. జై అమరావతి అంటూ వారు నినాదాలు చేశారు.
 
రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రసాదంపాడులో ఆదివారం నిర్వహించిన వంటవార్పు కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ సంఘీభావం తెలిపారు. వంట వార్పులో పాల్గొని నిరసన తెలియజేశారు.

కార్యక్రమంలో స్థానిక పెద్దలు గూడవల్లి నరసయ్య, బొప్పన హరికృష్ణ, కోనేరు నాగేంద్రకుమార్‌, అమరావతి జేఏసీ కన్వీనర్‌ స్వామి, కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, స్థానిక నేతలు పాల్గొన్నారు.
 
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని, వికేంద్రీకరణతో అభివృద్ధిని అన్ని జిల్లాలకు అందించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని అభివృద్ధికి రూ.1.10 లక్షల కోట్లు ఖర్చవుతుందనే వాదన సరైంది కాదన్నారు.

ఇప్పటికే రూ.9,500 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖలో సెక్రటేరియట్‌, హెచ్‌వోడీలు, వేసవి సమావేశాలకు అసెంబ్లీ తదితర వాటిని ఏర్పాటు చేయాలనే కమిటీ నివేదికలో హేతుబద్ధతలేదన్నారు. నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు విశాఖపట్నం చాలా ఎక్కువ దూరంలో ఉండటంతో విశాఖలో రాజధాని ఆలోచన విరమించాలని డిమాండ్‌ చేశారు.

అమరావతిలో పెద్దఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, ఒక కులానికి చెందిన వారే లబ్ధి పొందుతున్నారని మాట్లాడటం శోచనీయమన్నారు. ఈ అంశంపై 2016 మార్చి 7న శాసనసభలో ప్రతిపక్ష పార్టీ ఇవే ఆరోపణలు చేసినప్పుడు పాలకపక్షం వివరణాత్మక సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. సమావేశంలో అనుమోలు గాంధీ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు