సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా

శుక్రవారం, 13 అక్టోబరు 2023 (16:49 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబ నాయుడుకు సుప్రీంకోర్టులో శుక్రవారం కూడా ఉపశమనం లభించలేదు. తనపై అక్రమంగా బనాయించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అయితే, బుధవారం వరకు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేయదని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గీ కోర్టుకు తెలిపారు. అరెస్టు లేనపుడు బెయిల్ ప్రస్తావన ఎందుకని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించి, విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
 
అయితే, ఈ కేసు వాదనల సందర్భంగా ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబుకు 17ఏ పరిగణనలోకి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందని, ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ ఉందన్నారు. 
 
మరోవైపు, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినపిస్తూ బుధవారం వరకు చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయదని చెప్పారు. పీటీ వారెంట్లను బుధవారం వరకు అమలు చేయొద్దని ఏసీబీ కోర్టుకు విన్నవిస్తామని తెలిపారు. దీంతో ఆయన అండర్ టేరింగ్‌ను సుప్రీంకోర్టు రికార్డు చేసింది. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, అరెస్టు చేయనపుడు బెయిల్ ప్రస్తావన ఎందుకని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సోమవారం నాడు ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుపరచాల్సిన అవరం లేదని న్యాయవాదులు చెబుతున్నారు. అయితే, దీనిపై ఓ క్లారిటీ రావాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు