ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలం: సుజనాచౌదరి

గురువారం, 17 అక్టోబరు 2019 (07:42 IST)
రాష్ట్ర సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తే.. వైసీపీకి పడిన ఓట్ల కంటే దరఖాస్తులే ఎక్కువ వస్తాయని బీజేపీ నేత సుజనాచౌదరి అన్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పరిపాలనకు అతీతులమని సీఎం జగన్ భావిస్తున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలమైందన్నారు.

జగన్‌ను టార్గెట్ చేయడం మానుకొని సమస్యలను టార్గెట్ చేయాలని సూచించారు. గాంధీ సంకల్ప యాత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సుజనాచౌదరి స్పష్టం చేశారు. నందిగామ మండలం, కంచికచర్లలో సుజనా చౌదరి గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించారు.

కులమత వివక్షతకు తావులేని సమాజం కోసం గాంధీజీ కలలుకన్నారని, దేశంలో ప్రాంతీయ పార్టీలు తమ స్వార్థం కోసం కులతత్వాన్ని రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు కేంద్రం రిజర్వేషన్లు కల్పిస్తే రాష్ట్రంలో అమలు చేయకపోవడం అన్యాయమన్నారు.

దేశంలో బీజేపీ రెండు సీట్ల నుంచి... 300 సీట్లకు పెరిగిందని, ఏపీలోనూ బలపడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొన్నామన్నారు. అధికారం ఉంది కదా అని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించొద్దని సూచించారు.

పోలవరాన్ని చంద్రబాబు ఐదేళ్లు జాప్యం చేస్తే జగన్‌ ప్రభుత్వం ఐదు నెలలుగా మూలన పడేసిందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రపంచ నేతగా గుర్తింపు పొందారని, సమర్థ విదేశీవిధానంతో ప్రపంచదేశాలతో స్నేహబంధాలు మెరుగయ్యాయని సుజనా చౌదరి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు