ఏపీ పదో తరగతి పరీక్షలు అప్పుడే నిర్వహిస్తాం: విద్యా మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (19:50 IST)
విద్యావ్యవస్థ అభివృద్ధి, బలోపేతానికి ఏపీ ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రం తరపున సచివాలయం నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  రాష్ట్ర విద్యా విధానాలు, భవిష్యత్తు ప్రణాళిక, నిధుల వినియోగం, నిధుల విడుదలకు సంబంధించిన తదితర అంశాలపై కేంద్రమంత్రికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్  నేపథ్యంలో ఇంటికే పరిమితమైన విద్యార్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున దూరదర్శన్ ద్వారా  విద్యామృతం, ఆల్ ఇండియా రేడియో  ద్వారా విద్యాకలశం పేరుతో  విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యను అందిస్తున్నామని తెలిపారు.

అంతేగాక పరీక్షల నేపథ్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పునశ్చరణ (రివిజన్) తరగతులు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విద్యాసంవత్సరంలోని పనిదినాలలో మాత్రమే కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో భాగంగా వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై మంత్రి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు ‘జగనన్న గోరుముద్ద’లో భాగంగా మధ్యాహ్న భోజన పథకంలో పూర్తిగా మార్పు చేసి విస్తరింపజేశామని కేంద్రమంత్రికి తెలిపారు.

ఈ క్రమంలో 9,10వ తరగతి విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరింపజేస్తూ కోడిగుడ్లు, చిక్కి అందిస్తున్నామని తెలిపామన్నారు. అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 9,10వ తరగతుల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేస్తుండటంతో కేంద్రం సహాయసహకారాలు అందించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. 

రాష్ట్రానికి మరిన్ని కేజీబీవీ, మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని మంత్రి కోరారు. కేంద్రం సహకారంతో ఆన్ లైన్ యాప్స్ ను మరింత విస్తరింప జేయాలన్నారు. సమగ్రశిక్ష విధానంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1529 కోట్ల నిధుల్లో రూ.923 కోట్లు రాష్ట్రానికి అందాయని, మిగిలిన రూ.606 కోట్లు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో రేడియో, దూరదర్శన్ ద్వారా డిజిటల్, ఆన్‌లైన్ క్లాసులను అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈసందర్భంగా ఆన్ లైన్, డిజిటల్ తరగతులు మరింతగా వాడాలని కేంద్రమంత్రి సూచన చేశారు. 

ఈ క్రమంలో మౌలిక వసతులను బలోపేతం చేయాలని  మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్  మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి ధోత్రే సంజయ్ శ్యాంరావు ని  మంత్రి కోరారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల  గడువు తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే పదో తరగతికి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.

భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. త్వరలో రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించిన  క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.

సచివాలయం నాలుగో బ్లాక్ మొదటి అంతస్థులోని సమావేశ మందిరంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. రాజశేఖర్,  ఆంగ్ల విద్య ప్రాజెక్ట్ స్పెషల్ సెక్రటరీ, ఐఏఎస్ వెట్రిసెల్వి, ఎస్పీడీసీ కమిషనర్ చినవీరభద్రడు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ సీహెచ్.శ్రీధర్, మధ్యాహ్న భోజన పథకం అడిషనల్ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ టి.పార్వతి, కేజీబీవీ సెక్రటరీ, ఏపీఆర్ఎస్ సెక్రటరీ ఎం.ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు