చిరుత దాడి చేస్తే కొట్టేందుకు శ్రీవారి భక్తులకు చేతి కర్ర ఇస్తాం : తితిదే ఛైర్మన్ భూమన

సోమవారం, 14 ఆగస్టు 2023 (19:10 IST)
తిరుమలకు అలిపిరి మెట్ల మార్గంలో కాలి నడక వెళ్లే భక్తులకు చిరుత దాడి చేస్తే కొట్టేందుకు వీలుగా చేతి కర్ర ఇస్తామని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తుల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని ఆయన చెప్పారు. ఈ మార్గంలో నైపుణ్యం కలిగిన ఫారెస్ట్ సిబ్బందిని రక్షణగా నియమిస్తామని ఆయన తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, భక్తులపై చిరుత దాడి ఘటనపై అధికారులతో చర్చించినట్టు చెప్పారు. అలిపిరిలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పిల్లలను అనుమతిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిల్లలకు ఎంట్రీ లేదన్నారు. 
 
భక్తుల భద్రతకు నైపుణ్యం కలిగిన అటవీ సిబ్బందిని రక్షణగా నియమిస్తామన్నారు. నడక మార్గంలో సాధు జంతువులకు తినడానికి భక్తులు ఏమీ ఇవ్వరాదని చెప్పారు. అలా ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నడక దారిలో దుకాణాదారులు వ్యర్థ పదార్థాలను కూడా బయట పడేస్తే చర్యలు తప్పవన్నారు. భక్తుల భద్రత కోసం డ్రోన్లు వాడాలని నిర్ణయించినట్టు చెప్పారు. భద్రతపై భక్తులకు కూడా అవగాహన కల్పిస్తామన్నారు. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. 
 
కాలి నడకన తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడి చేతికి కర్ర ఇస్తామన్నారు. తిరుపతి - తిరుమల మధ్యలో 500 కెమరాలు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. నడక దారిలో బేస్ క్యాంపు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. మెట్ల మార్గంలో ఫోకస్ లైట్లు కూడా అమర్చుతామన్నారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల వరకే ద్విచక్రవాహనదారులను అనుమతిస్తామన్నారు. పెద్దలకు రాత్రి పది గంటల వరకే నడక దారిలో అనుమతి ఉంటుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు