ఇంట్లో కాలు జారిపడిన నృత్య కళాకారిణి శోభా నాయుడు ఇకలేరు...

బుధవారం, 14 అక్టోబరు 2020 (10:12 IST)
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభా నాయుడు ఇకలేరు. ఆమె బుధవారం వేకువజామున కన్నుమూశారు. నెల రోజుల క్రితం ఆమె ఇంట్లో కాలు జారిపడ్డారు. ఆసమయంలో ఆమె తల వెనుక భాగంలో గాయమైంది. దీనికి చికిత్స కోసం హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చింది. కానీ, అక్కడ తుదిశ్వాస విడిచింది. ఆర్థో న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు, రెండు వారాల క్రితం కరోనా కూడా సోకినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు. 
 
విశాఖ జిల్లా అనకాపల్లిలో వెంకటనాయుడు, సరోజినీ దేవి దంపతులకు 1956లో జన్మించిన ఆమె, చిన్నప్పటి నుంచీ వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిని అభ్యసించారు. దేశవిదేశాలలో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి పేరుతెచ్చుకున్నారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో ఆమెకు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈమె ఐఏఎస్ అధికారి సి. అర్జున రావును వివాహం చేసుకున్నారు. 
 
వెంపటి చినసత్యం శిష్యురాలిగా శోభానాయుడు కూచిపూడి అకాడమీని స్థాపించి గత 40 ఏళ్లుగా కూచిపూడి తరగతుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఆమె ఎన్నో అవార్డులను అందుకున్నారు. శోభానాయుడు మృతికి అధికార భాషా సంఘం అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ మాజీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్, సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ నాట్య కళాకారుడు కె.వి.వి.సత్యనారాయణ తదితరులు సంతాపాన్ని వెలిబుచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు