చిలుకలూరిపేట ఎమ్మెల్యేపై నిఘా ఎందుకు?

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (08:08 IST)
చిలుకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీపై నిఘా పెట్టిన కారణంగా ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఓ డీఎస్పీని..మరో సీఐని రాత్రికి రాత్రి వీఆర్‌కు పంపించేశారు. దీనికి కారణం విడుదల రజనీ.. ఆమె పీఏకు చెందిన ఫోన్లపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టి సమాచారం సేకరించడమే.

ఈ విషయం తెలిసిన విడదల రజనీ తనపై నిఘా పెట్టారన్న విషయాన్ని పార్టీ వ్యవహారాలతో పాటు.. షాడో హోంమినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారని ప్రచారం పొందుతున్న నేత దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే అలా నిఘా పెట్టిన డీఎస్పీ, సీఐలను వీఆర్‌కు పంపించేశారు.

అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే నిఘా పెట్టేందుకు ఆ పోలీసులు ఎందుకు సాహసించారనేది ఇక్కడ కీలకమైన విషయంగా మారింది.

విడదల రజనీ బీసీ కోటాలో మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పదవీ ప్రమాణం చేసిన తర్వాత .. పదవులు అందరికీ రెండున్నరేళ్లే ఉంటాయని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి పదవులు దక్కుతాయి. ఆ సమయం దగ్గర పడుతోంది.

తొలి సారి ఎమ్మెల్యే అయినప్పటికీ బీసీ కోటాలో మంత్రి పదవి పొందాలని ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై నిఘా పెట్టడం కలకలం రేపుతోంది. ప్రతిపక్ష నేతలు చెబితే నిఘా పెట్టే పరిస్థితి ప్రస్తుతానికిలేదు. అందు వల్ల వైసీపీ నేతలే ఆ పని చేసి ఉండవచ్చని అంటున్నారు.
 
విడదల రజనీకి. నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. వైసీపీలోనే ఇద్దరికి చెందిన వర్గాలు పదే పదే ఘర్షణలకు దిగుతున్నాయి. ఈ క్రమంలో ఎంపీనే తన ఫోన్లపై నిఘా పెట్టించారని.. ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.

ఒక వేళ అదే నిజం అయితే.. అధికార పార్టీ నేతలు చెబితేనే పోలీసులు నిఘా పెట్టారు. అలాంటప్పుడు వారిని బలి చేయడం ఎందుకన్న చర్చ పోలీసు వర్గాల్లో వస్తోంది. అయితే పోలీసులు ప్రస్తుతం. నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు.

కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్లు అత్యంత దారుణంగా కించ పర్చినా నోరెత్తలేని దీనస్థితికి దిగజారిపోయారు. అందుకే. మళ్లీ అధికారపెద్దల్ని బతిమిలాడి పోస్టింగ్ తెచ్చుకోవడం మినహా ఏమీ చేయలేరని రాజకీయ నేతలు అంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరులో పోలీసులు బలయ్యారంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు