అమెరికా: ‘‘భారత్ కరోనా మరణాల సంఖ్యను దాస్తోంది’’ - బైడెన్‌తో సంవాదంలో ట్రంప్ ఆరోపణ

బుధవారం, 30 సెప్టెంబరు 2020 (19:56 IST)
అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న డోనల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య మొదటి డిబేట్ మొదలైంది. ఆరోగ్యం, న్యాయం, జాతి వివక్ష, ఆర్థిక వ్యవస్థ లాంటి రకరకాల అంశాలపై ప్రత్యర్థులు ఇద్దరూ చర్చిస్తున్నారు. పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు.

 
కోవిడ్-19 మహమ్మారి గురించి అడిగిన ఒక ప్రశ్నకు “జో బైడెన్ తన స్థానంలో ఉంటే అమెరికాలో ఇంకా ఎక్కువ మరణాలు సంభవించేవని” డోనల్డ్ ట్రంప్ అన్నారు. సమాధానంగా “మహమ్మారితో పోరాడేందుకు ట్రంప్ దగ్గర ఎలాంటి ప్లాన్ లేద”ని జో బైడెన్ అన్నారు. అమెరికాలో 70 లక్షలకు పైగా కరోనా కేసులు ఉన్నాయి. ఈ వ్యాధితో ఇప్పటివరకూ దాదాపు 2 లక్షల మంది చనిపోయారు.

 
కరోనావైరస్‌పై చర్చ
కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని బైడెన్ విమర్శించారు. సమాధానంగా కరోనాను నియంత్రించడానికి తమ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని ట్రంప్ అన్నారు. “మా ప్రభుత్వం కరోనావైరస్‌ను ఎదుర్కోడానికి మాస్క్, పీపీఈ కిట్, మందులు తీసుకొచ్చింది. మేం కరోనా వ్యాక్సీన్ తయారీకి కొన్ని వారాల దూరంలో ఉన్నాం. నేను కంపెనీలతో మాట్లాడాను. మనం త్వరలోనే వ్యాక్సీన్ తయారు చేయగలమని నేను చెప్పగలను” అని ట్రంప్ అన్నారు.

 
అమెరికాలో కరోనా మరణాల గురించి మాట్లాడుతూ “భారత్, రష్యా, చైనా కరోనావైరస్ వల్ల సంభవించిన మరణాల సంఖ్యను దాస్తున్నాయని” ట్రంప్ ఆరోపించారు. వ్యాక్సీన్, ఫిజికల్ డిస్టెన్సింగ్ లాంటి అంశాలపై నేతలు ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.

 
“మాస్క్ ధరించడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణించలేదని బైడెన్ ఆరోపించారు. దీంతో ట్రంప్ ఎగతాళిగా “బైడెన్ 200 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, పెద్ద మాస్క్ వేసుకుని వచ్చేస్తారు” అన్నారు. మహమ్మారి సమయంలో భారీ జనాలతో ఎన్నికల ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు అని హోస్ట్ క్రిస్ వాలెస్ ట్రంప్‌ను ప్రశ్నించారు. సమాధానంగా ట్రంప్ “అంతమంది ఒక దగ్గరికి చేర్చగలిగితే, బైడెన్ కూడా అలాగే చేస్తారు” అన్నారు.

 
ట్రంప్‌కు చురకలు వేసిన బైడెన్ “మీరు మీ చేతికి బ్లీచ్ ఇంజెక్షన్ వేయించుకోండి. అది కరోనాను నయం చేస్తుందేమో” అన్నారు. సమాధానంగా “నేను ఆ మాట వ్యంగ్యంగా అన్నాను, అది మీకు తెలుస”న్నారు ట్రంప్. బైడెన్ తన స్థానంలో ఉంటే అమెరికాలో కోవిడ్-19 వల్ల రెండు కోట్ల మరణాలు సంభవించేవని ట్రంప్ అంటే, ట్రంప్ ‘అబద్ధాలకోరు’ అనే విషయం అందరికీ తెలుసన్నారు బైడెన్.

 
నేను లక్షల డాలర్ల టాక్స్ కట్టాను: ట్రంప్
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ తర్వాత అమెరికా ఆర్థికవ్యవస్థను ఎలా పట్టాలెక్కిస్తారని క్రిస్ వాలెస్ ఆర్థికవ్యవస్థ సెగ్మెంట్‌లో ఇద్దరినీ ప్రశ్నించారు. “లాక్‌డౌన్ తర్వాత అమెరికా ఆర్థికవ్యవస్థ అంచనాలకు మించిన వేగంతో కోలుకోబోతోంది. నేను అమెరికా చరిత్రలోనే అత్యంత మెరుగైన ఆర్థికవ్యవస్థను నిలబెట్టాను” అని ట్రంప్ అన్నారు.

 
ఆర్థిక వ్యవస్థపై చర్చ జరుగుతున్న సమయంలో ట్రంప్ టాక్స్ అంశం కూడా బయటకు వచ్చింది. హోస్ట్ క్రిస్ వాలెస్ న్యూయార్క్ టైమ్స్ రిపోర్టును ఉటంకిస్తూ “మీరు 2016-17లో 750 డాలర్ల టాక్స్ మాత్రమే చెల్లించారట, ఇది నిజమేనా?” అని ట్రంప్‌ను అడిగారు. “నేను లక్షల డాలర్ల ట్యాక్స్ చెల్లించాను. ఒక ఏడాదిలో 38 మిలియన్ డాలర్లు, మరో ఏడాదిలో 27 మిలియన్ డాలర్ల పన్నులు చెల్లించాను” అన్నారు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టును ట్రంప్ ‘ఫేక్ న్యూస్‌’ అని కొట్టిపారేశారు.

 
అమెరికా ప్రజలు మీకు ఓటెందుకు వేయాలి?
ఈ ప్రశ్నకు “అత్యంత మెరుగైన పాలన అందించిన ప్రభుత్వం మాదే. కరోనాకు ముందు మేం అభివృద్ధి బాటలో ఉన్నాం. దానికి కోలుకోలేని దెబ్బ తగిలింది” అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. “నా పదవీకాలం ముగిసేలోపు మేం ఎక్కువ మంది జడ్జిలను నియమించాం. నాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభించినప్పుడు 128 మంది జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వం బలహీనంగా ఉంటే, మా ప్రభుత్వం బలంగా ఉంది” అన్నారు.

 
ఇటు బైడెన్ “ట్రంప్ పాలనలో అమెరికా ఎక్కువగా అభద్రత, పేదరికంలోకి వెళ్లిపోతుందని జో బైడెన్ అన్నారు. ట్రంప్ ప్రభుత్వంలో సంపన్నులు మరింత సంపన్నులు అయ్యారు. పేదలు మరింత పేదలుగా మారారు” అన్నారు.

 
ట్రంప్, బైడెన్ చేతులు కలపలేదు
కరోనావైరస్ వల్ల తీసుకుంటున్న జాగ్రత్తల దృష్ట్యా ఈసారీ ఇద్దరు నేతలు కరచాలనం చేయలేదు. ఇద్దరు నేతల మధ్య ఈ చర్చ ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో జరుగుతోంది. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో ప్రజలను ఈ చర్చకు అనుమతించారు. డిబేట్ ప్రారంభంలో తదుపరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నామినేషన్ గురించి హోస్ట్ క్రిస్ వాలెస్ ఇద్దరినీ ప్రశ్నించారు.

 
ట్రంప్ తన నామినీ ఎమీ కోనీ బారెట్ నామినేషన్‌ను సమర్థించుకున్నారు. ఆమె దానికి అన్ని విధాలుగా తగినవారని చెప్పారు. ఈ చర్చ జరిగుతున్నప్పుడు అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలనియా ట్రంప్, జో బైడెన్ భార్య జిల్ బైడెన్ కూడా అక్కడే ఉన్నారు. డోనల్డ్ ట్రంప్ కూతుళ్లు ఇవాంక, టిఫనీ ట్రంప్ కూడా దీనికి హాజరయ్యారు. డిబేట్ సమయంలో ప్రేక్షకులు ఉత్సాహంగా అరవడం, శబ్దాలు చేయడం, చప్పట్లు కొట్టడం లాంటివి నిషేధించారు.

 
జాతి వివక్ష, నల్లజాతీయుల ఆందోళనలు
అమెరికా పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ హత్యకు గురైన తర్వాత దేశంలో చెలరేగిన హింస, జాతి వివక్ష గురించి కూడా డిబేట్ హోస్ట్ క్రిస్ వాలెస్ ప్రశ్నించారు. దీనిపై "ఒబామా-బైడెన్ పాలన సమయంలో జాతి వివక్ష ఉండేది. దానికి సంబంధించి హింస జరిగేది. అది ఇప్పుడు తగ్గింది" అని ట్రంప్ అన్నారు.

 
అటు బైడెన్ ఇటీవల ఏళ్లలో అమెరికాలో చట్టవ్యవస్థ పాడయ్యిందని అన్నారు. దానికి ట్రంప్ "బైడెన్ చట్ట వ్యవస్థపై నమ్మకం ఉంచడం లేదు. మేం న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచుతాం. కానీ మీకు అది లేదు. ఈ దేశ ప్రజలు న్యాయ వ్యవస్థ కోరుకుంటున్నారు" అన్నారు. అమెరికాలో చాలా ప్రాంతాల్లో 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఆందోళనలు జరగడం గురించి మాట్లాడిన బైడెన్ "వ్యతిరేక ప్రదర్శనల వల్ల ఎలాంటి హాని లేదు, కానీ హింస ఆమోదయోగ్యం కాద"ని అన్నారు.

 
డిబేట్‌లో 'షటప్' అని అరచుకున్న ట్రంప్, బైడెన్
ఈ డిబేట్‌లో డోనల్డ్ ట్రంప్, జో బైడెన్ చాలా సార్లు ఒకరిపై ఒకరు చిరాకు పడ్డారు. ఇద్దరూ పరస్పరం 'షటప్' అని కూడా అనుకున్నారు. డిబేట్ హోస్ట్ క్రిస్ వాలెస్ మధ్యలో జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పాల్సి వచ్చింది. చాలా అంశాలపై చర్చిస్తున్న సమయంలో ట్రంప్, బైడెన్ ఒకరినొకరు తిట్టుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే, చివరికి హోస్ట్ క్రిస్ వాలెస్ ఇద్దరినీ 'స్టాప్ టాకింగ్' అనాల్సి వచ్చింది.

 
చర్చ సమయంలో ఒకసారి ట్రంప్‌ మాటల మధ్యలో బైడెన్ జోక్యం చేసుకోగానే వాలెస్, తనతో "ఆయన చెప్పేది పూర్తి చేయనివ్వండి" అన్నారు. దానిపై ట్రంప్ వ్యంగ్యంగా "బైడెన్‌కు అది అసలు తెలీదు కదా" అన్నారు. అంతేకాదు, ట్రంప్, బైడెన్ డిబేట్ సమయంలో పరస్పరం చురకలు వేసుకున్నారు. ఒకరినొకరు ఎగతాళి చేసుకున్నారు. ట్రంప్‌ను తనను అమెరికా చరిత్రలోనే అత్యుత్తమ అధ్యక్షుడుగా చెప్పుకుంటే, ఇప్పటివరకూ అత్యంత చెత్త అధ్యక్షుడు ట్రంపేనని బైడెన్ విమర్శించారు.డిబేట్ సమయంలో ట్రంప్ మరోసారి బైడెన్‌తో "నా ముందు మిమ్మల్ని మీరు స్మార్ట్ అని చెప్పుకోకండి. నా ముందు స్మార్ట్ అనే మాట ఉపయోగించకండి" అన్నారు.

 
ఈ డిబేట్ హోస్ట్ ఎవరు?
డోనల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య ఈ డిబేట్‌కు అమెరికా న్యూస్ చానల్ ఫాక్స్ న్యూస్ యాంకర్ 72 ఏళ్ల క్రిస్ వాలెస్ హోస్ట్‌ గా వ్యవహరించారు. వాలెస్‌కు జర్నలిజంలో మంచి పేరుంది. ఫాక్స్ న్యూస్‌లో తన మిగతా సహచరుల కంటే ఆయన ఇమేజ్ భిన్నంగా ఉంటుంది. 

 
ఒక వైపు ఫాక్స్ న్యూస్‌లోని చాలా మంది జర్నలిస్టులు, అధ్యక్షుడు ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నప్పటికీ, వాలెస్ ఇమేజ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వాలెస్‌ను మంచి అవగాహన ఉన్న ఒక జర్నలిస్టుగా చూస్తారు.

 
అధ్యక్ష ఎన్నికల డిబేట్ నిర్వహించడం క్రిస్ వాలెస్‌కు ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు 2016లో కూడా ఆయన ఇలాంటి డిబేట్ హోస్ట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల డిబేట్ హోస్ట్ చేసిన ఫాక్స్ న్యూస్ మొదటి జర్నలిస్ట్ వాలెస్. ఇటీవల ఆయన అధ్యక్షుడు ట్రంప్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు