మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌‌ సర్కారులా కూలిపోకుండా రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాత్ ఎలా కాపాడుకున్నారు?

సోమవారం, 20 జులై 2020 (14:01 IST)
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ మధ్య భౌగోళికంగా వ్యత్యాసాలు ఉండచ్చు. కానీ రెండు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ ఘటనలు ఒకేలా కనిపించాయి. అయినప్పటికీ, భోపాల్‌లో కమల్‌నాథ్ అధికారం కోసం చేసిన పోరాటంలో కమలం చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులకు కొరకరానికొయ్యగా మిగిలారు.

 
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సంఖ్యా బలం బలహీనంగా ఉందని, కానీ రాజస్థాన్‌లో అది కాస్త మెరుగ్గా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. “కమల్‌నాథ్ కూడా కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడే. కానీ, రాజకీయ వ్యూహాల్లో గెహ్లాత్ ఆయన కంటే చాలా ముందు నిలిచారు. అందుకే, సవాళ్లు ఎదురయ్యే సమయానికే, తగిన సన్నాహాలతో ఆయన సిద్ధంగా కనిపించారు” అని రాజకీయ పండితులు చెబుతున్నారు.

 
ఐదేళ్ల వనవాసం తర్వాత ఏడాదిన్నర క్రితం రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే పార్టీలో విభజన స్పష్టంగా కనిపించడం మొదలైంది. అందులో ఒక వర్గం ముఖ్యమంత్రి గెహ్లాత్‌ వైపు నిలిస్తే, ఇంకో గ్రూప్ అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌పై ఆశలు పెట్టుకుంది.

 
రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి అయిన గెహ్లాత్‌, తన పార్టీలోని ప్రత్యర్థి గ్రూప్ నుంచి ఎప్పటికైనా సవాలు ఎదురవుతుందని ముందే అంచనా వేశారు. ఎందుకంటే 200 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 99 స్థానాలతోనే అధికారంలోకి వచ్చింది.

 
గెహ్లాత్ తన పరిస్థితిని ఎలా బలోపేతం చేశారు?
కానీ, రాష్ట్రీయ లోక్ దళ్‌తో కాంగ్రెస్ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన సుభాష్ గర్గ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. తర్వాత ఒక సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ తన బలాన్ని 101కి పెంచుకుంది. ఆ బలం మాత్రమే సరిపోదని గెహ్లాత్‌కు అనిపించింది. తన స్థితిని మరింత బలోపేతం చేసుకోడానికి ఆయన ప్రయత్నిస్తూనే వచ్చారు. బీఎస్పీ నుంచి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు గత ఏడాది కాంగ్రెస్‌లోకి వచ్చేవరకూ గెహ్లాత్ ప్రయత్నాలు విజయవంతం అవుతూనే వచ్చాయి.

 
కానీ, అది అంత సులభం కాలేదు. ఎందుకంటే, పార్టీలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్‌కు అది నచ్చలేదు. ఆయన దాన్ని వ్యతిరేకించారు. కానీ బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో కలవడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107కి పెరిగింది. ఈలోపు, గెహ్లాత్ స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలను కూడా తమ వైపు లాగేశారు. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నేపథ్యం ఉన్న నేతలే ఉన్నారు.

 
మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిస్థితిలో వ్యత్యాసం
“రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో వ్యత్యాసం ఉంది. అక్కడ కాంగ్రెస్ ఆధిక్యం తక్కువగా ఉంది. కానీ, రాజస్థాన్‌లో అది మెరుగైన స్థితి ఉంది” అని రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ అవధేష్ అకోదియా బీబీసీతో అన్నారు.

 
“గెహ్లాత్ మొదటి నుంచే అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే, గెహ్లాత్ బీజేపీ టార్గెట్లో ఉన్నారు. దానికి కారణం కూడా ఉంది. ఆయన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇన్‌ఛార్జిగా వెళ్లారు. తన పార్టీని పోటీలో నిలబెట్టారు. తర్వాత అహ్మద్ పటేల్ ఎంపిక, కర్ణాటకలో ఆయన చురుకుగా వ్యవహరించడం కూడా చూసిన బీజేపీ నాయకత్వం ఆయనపై ఒక కన్నేసి ఉంచింది. అందుకే సవాలు ఎదురవగానే, ఆయన దానికి సర్వ సన్నాహాలతో కనిపించారు” అన్నారు.

 
“మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ఎదురుగా, జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు జెండా ఎత్తారు. గ్వాలియర్ ప్రాంతంలో సింధియా ప్రభావం చాలా ఉంది. కానీ, రాజస్థాన్‌లో సచిన్ పైలెట్‌కు అంత ప్రభావం లేదు. ఎందుకంటే, సింధియాకు పూర్వ రాజరిక వారసత్వం కూడా ఉంది” అంటారు ఆకోదియా. “ఇక్కడ జరుగుతున్నదంతా అధికారం కోసం కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత పోరాటం. బీజేపీకి దీనితో ఎలాంటి సంబంధం లేదు. మధ్యప్రదేశ్ విషయం వేరే, అక్కడ బీజేపీ, కాంగ్రెస్ సంఖ్యా బలంలో పెద్దగా తేడా లేదు” ” అని రాష్ట్ర ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా కూడా బీబీసీతో అన్నారు.

 
ముఖ్యమంత్రి గెహ్లాత్ రాజ్యసభ ఎన్నికలకు పది రోజుల ముందు గత నెలలో హడావుడిగా ఎమ్మెల్యేలను సమావేశపరిచినపుడు రాష్ట్ర ప్రజలందరూ షాక్ అయ్యారు. అక్కడి నుంచే అటే, ఆయన వాళ్లను తమ క్యాంపుకు తీసుకెళ్లాడు. బీజేపీ బేరసారాలకు ప్రయత్నిస్తోందని అధికార పార్టీ నేతలు అప్పుడు చెప్పారు, కానీ, పైలెట్ మద్దతుదారులు మాత్రం వాటిని అర్థంలేని ఆరోపణలుగా కొట్టిపారేశారు. గెహ్లాత్‌ను లక్ష్యంగా చేసుకున్న పైలెట్ వర్గం, అధికార పార్టీ నేతలు లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

 
అంచనా వేయలేకపోయారు
భోపాల్ సీనియర్ జర్నలిస్ట్ గిరీష్ ఉపాధ్యాయ్ రెండు రాష్ట్రాల్లో పనిచేశారు. రెండు రాష్ట్రాల రాజకీయాల గురించి ఆయనకు బాగా తెలుసు. “కమల్‌నాథ్ అప్పుడు అప్రమత్తంగా లేరని కాదు, ఆయన కూడా అలర్ట్ గానే ఉన్నారు. ఎందుకంటే మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతలు మొదటి రోజు నుంచే ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారు. కమల్‌నాథ్ చాలా తెలివైన నేత. ఆయనతోపాటూ రాజకీయాల్లో ప్రవీణుడైన దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. కానీ అవేవీ పనిచేయలేదు. కాంగ్రెస్ దగ్గర సంఖ్య కూడా తక్కువంది. తర్వాత వారిలోంచి కూడా కొంతమంది వెళ్లిపోయారు. నిజానికి దానిని కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ అంచనా వేయలేకపోయారు. సింధియా తనతో వచ్చినవారితో కలిసి బీజేపీలోకి వెళ్లిపోయారు” అన్నారు ఉపాధ్యాయ్.

 
మధ్యప్రదేశ్ నేతలతో పోలిస్తే, రాజకీయ వ్యవహారాల్లో గెహ్లాత్ చాలా ముందున్నారు. ఆయన పార్టీలో తన ప్రత్యర్థులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అలా వారిని ఎంత దూరం వెళ్లనిచ్చాడంటే, గెహ్లాత్ పన్నిన ఉచ్చులో వారు తమకు తెలీకుండానే పడిపోయారు” అని చెప్పారు. అది తలుసుకోలేని గెహ్లాత్ ప్రత్యర్థులు ఎంత ముందుకు వెళ్లిపోయారంటే, వారికి కాంగ్రెస్ హై కమాండ్ కూడా సాయం చేసే అవకాశం లేకుండాపోయింది. గెహ్లాత్ వ్యూహం, ఆయన దౌత్యం కూడా ఫలించింది.

 
“సింధియా, పైలెట్‌ మధ్య ఒక పెద్ద తేడా ఉంది. సింధియా మైదానంలో దూకడానికి ముందే తన మద్దతుదారుల బరువెంతో తూచాడు. కానీ సచిన్ తనది, తన మద్దతుదారుల బరువు ఎంతుందో తెలుసుకోలేకపోయారు”. రాజుల కాలంలో ఎలా నమ్మకంగా ఉండేవారో, అలాగే సింధియా మద్దతుదారులు తమ నాయకుడిపై విశ్వాసం చూపించారు.

 
అక్కడ కలిసి వస్తే, ఇక్కడ మౌనం వహించారు
బీజేపీ మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ను గద్దె దించే ప్రయత్నాలు మొదలుపెట్టినపుడు, దానికి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా, మిగతా నేతలందరూ అండగా నిలిచారు. కానీ రాజస్థాన్‌లో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈ మొత్తం ఘటనాక్రమంలో మౌనంగానే ఉన్నారు. మరోవైపు, గెహ్లాత్, రాజేతో కుమ్మక్కయ్యారని పైలెట్ ఆరోపణలు కూడా చేశారు. బీజేపీ మిత్రపక్షాలు ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ బేనీవాల్ అయితే, “వసుంధరా రాజే ఈ పోరాటంలో ముఖ్యమంత్రి గెహ్లాత్‌కు సాయం కూడా చేస్తున్నారు” అనేశారు.

 
దీనిపై బీజేపీలో కూడా చాలా హంగామా జరిగింది. రాజే మద్దతుదారులు దీనిపై తీవ్రంగా స్పందించారు. సుదీర్ఘ మౌనం తర్వాత రాజే శనివారం ట్వీట్ చేశారు. “కాంగ్రెస్ అంతర్గత కలహాల వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. జనం ఆందోళనగా ఉన్నారు. బీజేపీ నాయకత్వాన్ని నిందించడంలో కాంగ్రెస్ బిజీగా ఉంది” అన్నారు. బీజేపీతో తమకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న ఆరోపణలను రాజే ఖండిస్తున్నట్లు పైలెట్ మద్దతుదారులకు అనిపిస్తోంది. అందుకే పైలెట్ ఉద్దేశపూర్వకంగా రాజేను లక్ష్యంగా చేసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు.

 
రాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచరియావాస్‌ను సచిన్ పైలెట్‌కు సన్నిహితుడుగా భావిస్తారు. కానీ తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పిన పైలెట్ తిరుగుబాటు చేయగానే, ఖాచరియావాస్ పైలెట్‌కు వ్యతిరేకంగా మారారు. “ఏ పార్టీకీ హాని చేయడానికి మాకు అనుమతి లేదు. పైలెట్ అలాంటిది ఏదో ఆలోచిస్తున్నారని నాకు అనిపించింది. ముఖ్యమంత్రి గెహ్లాత్ ముందు నుంచే అప్రమత్తంగా ఉన్నారు” అని ఖాచరియావాస్ బీబీసీతో అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ గెహ్లాత్ ప్రభుత్వం నడిపించారని ఆయన చెబుతున్నారు.

 
యుద్ధానికి అవసరమైనవన్నీ సిద్ధం
“ముఖ్యమంత్రికి పూర్తిగా తెలుసు. రాత్రి రెండున్నర గంటల వరకూ పనిచేసే ఒక వ్యక్తిని, వీళ్లేం ఎదుర్కోగలరు” అని పైలెట్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమితులైన గోవింద్ సింగ్ డోటాసరా అన్నారు. “పైలెట్ బీజేపీతో కలిసిపోయి ప్రభుత్వం కూల్చాలని ప్రయత్నించే సమయానికి, మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర ఆ పోరాటానికి అవసరమైన సంఖ్య అన్ని సాధనాలూ, పరికరాలు సిద్ధంగా ఉన్నాయి” అన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కూడా మీడియాతో అదే విషయం చెప్పారు.

 
“పైలెట్ మొదటి నుంచీ అదే భావనతో పనిచేస్తున్నారు. గత ఏడు నెలలుగా ఆయన ఇదే ప్రణాళికతో ఉన్నారు. మొదట జూన్ 11న ఆయన ఎమ్మెల్యేలను ఒక కార్యక్రమం పేరుతో బయటకు తీసుకెళ్లబోయారు. కానీ మేం సమయానికి చర్యలు తీసుకున్నాం” అన్నారు. గెహ్లాత్ తన బలం పెంచుకోడానికి భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఇద్దరు సీపీఎం ఎమ్మెల్యేలు ఉంటే, వారిలో ఒకరిని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేలా ఒప్పించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు రెండు పక్కపక్కనే ఉంటాయి. కానీ నది రెండు తీరాల్లాగే ఈ రెండు రాష్ట్రాల రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు కూడా వేరువేరుగా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు