లూనా-25: చంద్రుడి మీద కూలిపోయిన రష్యా స్పేస్‌క్రాఫ్ట్

సోమవారం, 21 ఆగస్టు 2023 (12:51 IST)
కర్టెసీ-రాస్కోమాస్
రష్యా ప్రయోగించిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి మీద కూలిపోయిందని ఆ దేశ అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ప్రకటించింది. కూలిపోవడానికి ముందు ఈ అంతరిక్ష నౌక అదుపు తప్పిన స్థితిలో కక్ష్యలో పరిభ్రమించిందని వెల్లడించారు. ఈ మానవ రహిత నౌక చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ కావాల్సి ఉండగా, ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌లోకి ప్రవేశించేటప్పుడు అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. సోమవారం నాడు ఈ వ్యోమనౌక చంద్రుడి మీద దిగాల్సి ఉంది.
 
శనివారం మధ్యాహ్నం 2:57 గంటల తర్వాత లూనా-25తో సంబంధాలు తెగిపోయాయని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రాస్‌కాస్మోస్ ఆదివారం ఉదయం తెలిపింది. "స్పేస్ క్రాఫ్ట్ అనూహ్యమైన కక్ష్యలోకి వెళ్లింది. చంద్రుని ఉపరితలంతో ఢీకొన్న కారణంగా అది ధ్వంసమైంది’’ అని రాస్‌కాస్మోస్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, రష్యాలు రెండూ ప్రస్తుతం చంద్రుడి మీదకు ల్యాండర్లు పంపించాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మిషన్ అయిన చంద్రయాన్-3 ఈ నెల 23న చంద్రుడి మీద ల్యాండ్ కావాల్సి ఉంది.
 
చంద్రయాన్-3 కంటే ఆలస్యంగా ప్రయోగించిన లూనా-25, దానికన్నా ముందుగానే, అంటే సోమవారం నాటికే చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అవుతుందని అంచనా వేశారు. కానీ, చివరి నిమిషంలో రష్యా వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్ కాకుండా చంద్రుడి మీద కూలిపోయిందని ఆ దేశ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. రష్యా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ఈ సాంకేతిక వైఫల్యం కారణంగా ముందుగా నిర్దేశించిన ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలోకి వెళ్ళలేకపోయిందని అంతకు ముందు ప్రకటించింది. ఆ తర్వాత కాసేపటికే అది చంద్రుడి మీద కూలిపోయినట్లు వెల్లడించింది.
 
ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుని మీద ఘనీభవించిన నీటి జాడలను, విలువైన మూలకాలను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. అమెరికా, చైనా ఇప్పటికే చంద్రుని ఉపరితలంపై దిగినప్పటికీ.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇంత వరకు ఏ దేశమూ తమ వ్యోమనౌకను దింపలేదు. 50 ఏళ్ల తర్వాత రష్యా ఇప్పుడు లూనా 25 పేరుతో తాజా మిషన్ చేపట్టినప్పటికీ అది విఫలమైంది.
 
దక్షిణ ధ్రువంపై మొదట దిగేది ఎవరన్న పోటీ ముగిసినట్లే
ఇటీవల కాలంలో భారత్, రష్యాలు పంపిన వ్యోమనౌకలలో ఏది ముందు చంద్రుడి దక్షిణ ధ్రువం పై దిగుతుంది అన్న ఆసక్తి కనిపించింది. ఇరు దేశాలు ప్రయోగించిన ఈ మూన్ మిషన్‌‌లను అంతరిక్షంలో చిన్న పరుగు పందెంగా(మినీ స్పేస్ రేస్‌గా) అభివర్ణించారు. అయితే, ఇది పరుగు పందెం కాదని, చంద్రుడిపైన కొత్త ‘మీటింగ్ పాయింట్’ను తాము పొందనున్నట్లు ఇస్రో చైర్మన్ బీబీసీకి తెలిపారు. 1960ల్లో ఇస్రో ఏర్పాటు చేసిన తొలి రోజు నుంచి కూడా సంస్థ ఎప్పుడూ ఇతర ప్రయోగాలతో పోటీ పడలేదని ఇస్రో అధికార ప్రతినిధి చెప్పారు.
 
‘‘అంతరిక్ష నౌకను తయారు చేయడం, చంద్రుడిపైన ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని, గుర్తించని వైపు చేరుకునేలా అందుబాటులో ఉన్న మా సాంకేతిక అంశాలకు అనుగుణంగా మేం ఈ లూనార్ మిషన్ ప్లాన్‌ను సిద్ధం చేశాం’’ అని తెలిపారు. ‘‘లూనా-25 కూడా ఎంతో కాలం క్రితం ప్లాన్ చేసిన లూనార్ మిషన్. వారు కూడా కొన్ని సాంకేతిక విషయాలను దృష్టిలో ఉంచుకుని దానిని సిద్ధం చేసి ఉండొచ్చు. దాని గురించి మాకు తెలియదు’’ అని ఆయన అన్నారు.
 
50 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రయోగం
చంద్రుడి మీద తొలిసారిగా ల్యాండయిన మానవ నిర్మిత ప్రోబ్‌ రష్యా పంపిందే. 1958 ఆగస్ట్ 17న తొలిసారిగా అమెరికా చంద్రుడి మీదకు పయనీర్ అనే ఆర్బిటర్‌ను చంద్రుడి మీదకు పంపండంతో చంద్రుడి పైకి గ్రహాంతర ప్రయోగాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రష్యా 1958 సెప్టెంబర్ 23న లూనా ఈ వన్ నెంబర్ వన్ అనే ఇంపాక్టర్‌ను ప్రయోగించింది. కానీ అది విఫలమైంది. 1959 జనవరి 4న లూనా వన్ అనే ప్రోబ్‌ను ప్రయోగించినా అదీ ఫెయిలైంది.
 
1959 సెప్టెంబర్ 14న రష్యా ప్రయోగించిన లూనా 2 విజయవంతంగా చంద్రుడి మీద ల్యాండయ్యింది. ఇలా చంద్రుడి మీద ల్యాండయిన తొలి మానవ నిర్మిత ప్రోబ్‌గా లూనా 2 చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 1976 వరకూ కూడా రష్యా లూనా పేరుతో 24 మిషన్లను చంద్రుడి మీదకు ప్రయోగించింది. 1976 ఆగస్ట్ 18న రష్యా ప్రయోగించిన లూనా 24 ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పటి వరకూ ఈ అన్ని ప్రయోగాలు చంద్రుడి ఈక్వేటర్ దగ్గరగానే జరిగాయి. కానీ రష్యా తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండయ్యేందుకు దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లూనా 25 పేరుతో ఒక ల్యాండర్‌ను పంపించింది. ఇందులో ల్యాండర్, రోవర్ మ్యాడ్యూళ్లను పంపాలని రష్యా ముందుగా భావించినా, చివరికి ల్యాండర్‌ను మాత్రమే ప్రయోగించింది. కానీ, సాంకేతిక వైఫల్యం కారణంగా లూనా 25 చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది.
 
లూనా 26, 27 ఎప్పుడు ప్రారంభం కానున్నాయి.
1976 తర్వాత అమెరికా, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇజ్రాయెల్, భారత్, జపాన్ వంటి దేశాలు చంద్రుడి మీద పరిశోధనలు కొనసాగిస్తూ వచ్చాయి. కానీ రష్యా మాత్రం చంద్రుడి వైపు చూడలేదు. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రుడి మీద ప్రయోగాలకు రష్యా సిద్ధమైంది. అందులో భాగంగానే లూనా 25ను ప్రయోగించింది. ఇది ఫెయిలైనా రష్యా ప్రయత్నాలు ఇక్కడితో ఆగిపోవు. 2027లో లూనా-26, 2028లో లూనా-27, 2030లో లూనా-28 ప్రయోగాలు కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు