బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కరోనా వైరస్

బుధవారం, 11 మార్చి 2020 (09:44 IST)
బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కరోనా వైరస్ సోకింది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా నాడిన్ డోరీస్‌ కొనసాగుతున్నారు. ఈమెకు కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ వచ్చింది. దీంతో ఆమెకు వైద్యపరీక్షలు చేయగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. 
 
వైద్యుల సలహాపై తాను ముందుజాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్నానని నాడిన్ డోరీస్ జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. డోరీస్ గతంలో 2019 నుంచి స్టేట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్ పార్లమెంటరీ అండర్ సెక్రటరీగాను పనిచేశారు. యూకేలో కరోనా వైరస్ వచ్చిన మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా డోరీస్ నిలిచారు. 
 
'నేను చేయించుకున్న పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. వైద్యుల సలహాపై నేను ఇంట్లోనే స్వయం ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతున్నాను' అని డోరీస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
కాగా, బ్రిటన్‌లో ఇప్పటివరకు 380 మందికి కరోనా వైరస్ సోకగా, ఇందులో ఆరుగురు మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మరణాలు నాలుగు వేలకు పైగానే ఉన్నాయి. మొత్తం 113 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు