ప్రపంచ ప్రజలకు శుభవార్త చెప్పిన ఫైజర్...

బుధవారం, 18 నవంబరు 2020 (21:17 IST)
ప్రపంచ ప్రజలకు ఫైజర్ కంపెనీ శుభవార్త చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టే టీకాను ఫైజర్ కంపెనీ తయారు చేసింది. తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తోందని ప్రకటించింది. 
 
ప్రస్తుతం ఈ కంపెనీ తయారు చేసిన టీకా క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా సాగుతున్నాయి. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని వయసుల వారిలోనూ దీని ప్రభావం స్థిరంగా ఉందని, త్వరలోనే యూఎస్ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది. 
 
అంతేకాకుండా, ప్రస్తుతం తాము తయారు చేసిన ఈ టీకా 95 శాతం సమర్థత ప్రదర్శించిందని అమెరికా ఫార్మా దిగ్గజం ప్రకటించింది. కరోనా ముప్పు అధికంగా ఉండే 65 ఏళ్లకు పైబడిన వారిలోనూ దీని సమర్థత 94 శాతానికి పైగా ఉందని వివరించింది. 
 
తమ వ్యాక్సిన్ 90 శాతం ఫలితాలు ఇస్తోందన్నారు. గతవారం ప్రకటించిన ఫైజర్ తాజాగా 95 శాతం సమర్థ ప్రదర్శించినట్టు పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన తాజా విశ్లేషణను బుధవారం వెల్లడించింది. 
 
170 మంది కరోనా రోగులపై టీకాను ప్రయోగించగా తొలి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత మంచి ఫలితాలు వచ్చినట్టు వివరించింది. కాగా, ఈ టీకాను మైనస్ 70 డిగ్రీల వద్ద మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండటంతో ఆ వసతులు లేని దేశాలు టీకా కొనుగోలుపై డోలాయమానంలో ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు