పొట్టకూటికోసం బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీలంక క్రికెటర్

మంగళవారం, 2 మార్చి 2021 (15:54 IST)
కరోనా వైరస్ కారణంగా అనేక మంది జీవితాలు తలకిందులయ్యాయి. కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారు. అలాంటి వారిలో సినీ, క్రికెట్ సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు శ్రీలంక మాజీ క్రికెటర్. ఉపాధిని వెతుక్కుంటూ ఆస్ట్రేలియాకు వెళ్లిన ఈయన... ఇపుడు అక్కడ ఓ ప్రజా రవాణా బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సూరజ్‌ రణ్‌దీవ్‌. శ్రీలంక మాజీ క్రికెటర్. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టి20 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్‌స్పిన్నర్‌. ఈ క్రికెటర్ ప్రదర్శన కంటే.. భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ సెంచరీ పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా ‘నోబాల్‌’ వేసిన బౌలర్‌గానే భారత అభిమానులకు బాగా తెలుసు. 
 
రెండేళ్ల క్రితం స్వదేశంలో చివరి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన అతను ఉపాధిని వెతుక్కుంటూ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. మెల్‌బోర్న్‌లో స్థానిక క్లబ్‌లలో క్రికెట్‌ ఆడుతున్నా... సంపాదన కోసం అతను మరో ఉద్యోగాన్ని చూసుకోక తప్పలేదు.
 
దాంతో రణ్‌దీవ్‌ అక్కడ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఫ్రాన్స్‌ కంపెనీ ‘ట్రాన్స్‌డెవ్‌’ నిర్వహణలో నడుస్తున్న ప్రజా రవాణా బస్సులో అతను డ్రైవర్‌గా చేరాడు. కొన్ని చిన్నస్థాయి క్రికెట్‌ దేశాల్లో ఆదాయం కోసం ఇతర పనులు చేయడం సాధారణమే అయినా... ఒక ఆసియా జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్‌ చిరుద్యోగం చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది 
 
2011 ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున రణ్‌దీవ్‌ 8 మ్యాచ్‌లు ఆడి ఆకట్టుకునే ప్రదర్శనే (7.68 ఎకానమీ) కనబర్చాడు. లంక తరఫున రణ్‌దీవ్‌ 2016లో చివరి మ్యాచ్‌ ఆడాడు. అతనితోపాటు మరో ఇద్దరు క్రికెటర్లు చింతక జయసింఘే (శ్రీలంక), వాడింగ్టన్‌ వయెంగా (జింబాబ్వే) కూడా ఇదే కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తుండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు