ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు లెఖ్ఖ: భాజపా గురించి పవన్ స్టాండ్ అంతేగా... అంతేగా...

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:36 IST)
బిజెపి.. జనసేన రెండు పార్టీలు ప్రస్తుతం కలిసే ముందుకు వెళుతున్నాయి. బిజెపితో జతకట్టిన తరువాత జనసేన పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దాన్ని ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. వారితో కలిసే నడుస్తున్నారు.
 
అయితే ఈమధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపి కనీసం 50 సీట్లు కూడా రాష్ట్రంలో సాధించలేకపోవడం.. బిజెపి తరపున మద్ధతుదారులు పూర్తిగా చతికిలపడడం జరిగింది. ఇక జనసేన పార్టీ మధ్దతుదారులు మాత్రం అధిక సంఖ్యలోనే గెలవడమే కాకుండా కొన్ని చోట్ల గట్టి పోటీ కూడా ఇచ్చారు.
 
వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని చెప్పుకునే బిజెపికి ఇది పెద్ద షాకే. అయితే తనకున్న చరిష్మాతో ప్రజలు ఓట్లేస్తున్నారని.. బిజెపిపై జనంలో ఇప్పటికీ వ్యతిరేకత ఉందని భావించిన పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డారట. అసలు బిజెపితో పొత్తు అవసరమా అన్న ఆలోచనలో ఉన్నారట జనసేనాని.
 
ముందు నుంచి జనసైనికులకు బిజెపితో కలవడం ఏమాత్రం ఇష్టం లేదట. ఇదే విషయాన్ని అధినేత దృష్టికి వారు తీసుకెళ్ళారట. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత మళ్ళీ వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో ఇక క్రిందిస్థాయి నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు.
 
కానీ ప్రస్తుతం మాత్రం జనసేనకే ప్రజల్లో ఆదరణ ఉండటం.. జనసేన పార్టీ అభ్యర్థులకు జనం ఓట్లేస్తుండటం పవన్ కళ్యాణ్ ఆలోచనకు ప్రధాన కారణమట. అయితే కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటే మంచిదన్న అభిప్రాయం ఒకవైపు.. మరోవైపు ఆ పార్టీకి ఎపిలో అంత సీను లేదంటూ స్థానిక నేతలు మరోవైపు చెబుతుండటంతో జనసేనాని మాత్రం ఎటువైపు వెళ్ళాలో తెలియక సమాలోచనలో ఉన్నారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు