ఆరోగ్యానికి.. అందానికి ఉపయోగపడే ఆవనూనె!

సోమవారం, 25 జనవరి 2016 (09:24 IST)
ఆవాలతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి కాబట్టే వాటిని తాలింపులో విరివిగా వాడుతూ ఉంటాం. అలాంటి ఆవాల నుంచి తీసిన ఆవనూనెని వంటల్లో వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఆవనూనె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే అందరూ ఆవనూనె ఎక్కువగా వాడతారు. 
 
వంటల్లో ఆవనూనె వాడకం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నూనె వాడకం వల్ల బ్యాడ్‌ కొలెస్టరాల్‌ తగ్గి గుడ్‌ కొలెస్టరాల్‌ పెరుగుతుంది. అలాగే రక్తంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. ఫలితంగా స్థూలకాయం సమస్య దరిచేరదు. ఆవనూనె వాడకం వల్ల మూత్రపిండాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ఈ నూనె వాడకం వల్ల హైపర్‌ థైరాయిడ్‌ రాకుండా ఉంటుంది. 
 
ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్న చిన్నపేగు, జీర్ణాశయం, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియాలను హరిస్తుంది. ఆవనూనె వాడకం ఇష్టం లేనివారు ఆవనూనెను నెయ్యి, వేరుశనగ నూనెలతో కలిపి కూడా వాడుకోవచ్చు. 
 
పరిశుభ్రమైన ఆవనూనె కుడిచేతితో కొద్దికొద్దిగా అద్దుకొని నిదానంగా కళ్లకింద నల్లని వలయాలపైన మృదువుగా రెండుపూటలా మర్ధన చేయాలి. ఇలా చేస్తూ ఉసిరికాయలపొడి, పటికబెల్లం పొడి కలిపి తింటే దీని వల్ల కళ్ళకింద ఏర్పడిన నల్లని వలయాలు క్రమంగా తగ్గిపోతుంది.

వెబ్దునియా పై చదవండి