లాక్ డౌన్, ఇంట్లో వున్నాం కదా, ఆవకాయ పచ్చడి చేసేద్దాం

శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (21:34 IST)
రోనా వైరస్ లాక్ డౌన్ ఫలితంగా ఇప్పుడంతా ఇంట్లోనే వుండాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికితోడు బయటకు వెళ్లాలంటే వైరస్ భయం. అందుకే ఇంట్లోనే ఏదో పచ్చడి వేసుకుని తింటూ కానించేస్తున్నారు చాలామంది. మరోవైపు వేసవిలో పచ్చళ్లు పడుతుంటారు. ఎలాగూ ఇంట్లోనే వుండటంతో పెరట్లో వున్న మామిడి కాయలతో ఆవకాయ పచ్చడి పట్టుకుంటే సరి. అదెలో చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
మామిడికాయలు( మోస్తరు పెద్ద సైజు) - 6
కారం - 200 గ్రాములు
ఉప్పు - 200 గ్రాములు
పసుపు - 2 స్పూన్స్
మెంతులు - 25 గ్రాములు
నువ్వుల నూనె - 1/2 కిలో
శనగలు - కొన్ని
ఆవపిండి - కొద్దిగా
 
తయారీ విధానం:
ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఓ మోస్తరు సైజు ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ లేదా పళ్ళెం తీసుకొని దానిలో పైన చెప్పుకున్న కొలతలకు అనుగుణంగా ఆవపిండి, కారం, పసుపు, మెంతులు, చిన్న శనగలు వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు మాత్రం అంతా ఒక్కసారే వేసుకోకుండా కొద్దిగా తగ్గించి వేసుకొని తరువాత రుచి చూసి తక్కువైతే వేసుకోవచ్చు.
 
ఈ మిశ్రమానికి తరిగిన మామిడి ముక్కలు కలిపి దాని మీద కొద్దిగా నూనె వేసుకుని కలిపి కొద్దిగా తడి పొడి అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని ఒక జాడీలో వేసి పెట్టుకోవాలి. కారం మిశ్రమం, పొడిలో కలిపిన మామిడి ముక్కలు జాడీలో పొరలు పొరలుగా వేసుకోవాలి. ఆ తరువాత జాడీలో పైఅంగుళం వరకూ నూనెను పోసుకోవాలి.
 
పొడి బట్టతో జాడీకి మూతను సరిగా పెట్టి మూతిని గట్టిగా కట్టేసుకోవాలి. ఈ జాడీని నీళ్లు, తేమ లేని వంటగదిలో శుభ్రంగా ఉన్న ఒక చోట పెట్టాలి. మూడు రోజుల తరువాత బాగా ఊట వస్తుంది. జాడీలోని ఆవకాయను ఒక పెద్ద పళ్లెంలోకి తీసుకొని బాగా పెద్ద గరిటతో కలుపుకోవాలి. అంతే.. ఆవకాయ పచ్చడి రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు