అమెరికా జైళ్లలో 161 మంది భారతీయులు.. ఎందుకో తెలుసా?

మంగళవారం, 19 మే 2020 (06:21 IST)
161 మంది భారతీయులను అమెరికా అదుపులోకి తీసుకుంది. వారిని ఈ వారంలో వెనక్కు పంపనున్నట్లు తెలిపింది. వారికి ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలన్నీ మూసుకుపోవడంతో ఒక ప్రత్యేక విమానంలో అమృత్‌సర్‌కు పంపించనుంది.

వీరిలో 76 మంది హర్యానాకు చెందిన వారు ఉన్నారు. అలాగే పంజాబ్‌కు చెందిన 56మంది, గుజరాత్‌ కు చెందిన 12 మంది, యుపికి చెందిన ఐదుగురు, మహారాష్ట్రకు చెందిన నలుగురు, కేరళ, తమిళనాడు, తెలంగాణలకు చెందిన వారు ఇద్దరు చొప్పున, ఆంధ్రప్రదేశ్‌, గోవా రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

వివరాల ప్రకారం.. అమెరికాలోని 95 జైళ్లలో ఉన్న 1,739 మంది ఖైదీల్లో వీరు ఉన్నారని నార్త్‌ అమెరికన్‌ పంజాబీ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్నామ్‌ సింగ్‌ చాహాల్‌ తెలిపారు. వీరందరినీ తమ దేశంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారంటూ, ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అదుపులోకి తీసుకుంది.

వీరంతా దక్షిణ మెక్సికో సరిహద్దుల నుంచి తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అమెరికా ఆరోపిస్తోంది. ఐసిఇ నివేదిక ప్రకారం.. 2018లో 611 మందిని భారత్‌కు తిరిగి పంపగా, గతేడాది 1,616 మందిని వెనక్కు పంపింది.

ఇక ఇప్పుడు తిరిగి పంపిస్తున్న 161 మందిలో ముగ్గురు మహిళలు కూడా వున్నారని, ఇప్పటికీ అమెరికన్‌ జైళ్లలో ఉన్న ఇతర భారతీయుల పరిస్థితిపై సమాచారం లేదని సత్నామ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు