కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా.. వేల సంఖ్యలో మృతులు

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (11:18 IST)
చైనాలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటివరకు 24 వేల మందికిపైగా రోగులు చనిపోయినట్టు సమాచారం. అలాగే, దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కరోనా వైరస్‌కు వ్యూహాన్ నగరం కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. నిత్యం అత్యంత రద్దీగా ఉండే చైనాలోని ప్రధాన నగరాల రహదారులన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ప్రజలెవ్వరూ తమ ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదు. వైరస్ కారణంగా 564 మంది చనిపోయారని చైనా అధికారికంగా ప్రకటించింది. 
 
కానీ, చైనాలో అతి పెద్ద ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్ 'టెన్సెంట్' మాత్రం ఓ భయంకర నిజాన్ని వెల్లడించింది. చైనాలో కరోనా వైరస్ 1,54,023 మందికి సోకిందని... వీరిలో 24,589 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో, చైనాలో తీవ్ర కలకలం రేగింది. ఆ తర్వాత ఆ వెబ్‌సైట్ తన గణాంకాలను మార్చింది. 14,4456 మంది వైరస్ బారిన పడ్డారని, వీరిలో 304 మంది చనిపోయారని తెలిపింది.
 
టెన్సెంట్ తన గణాంకాలను మార్చినా ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. టెన్సెంట్ కచ్చితమైన వివరాలనే వెల్లడించిందని... ప్రభుత్వ హెచ్చరికలతో గణాంకాలను మార్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు, చైనాలో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. వూహాన్‌‌లోనే లక్ష నుంచి 3.5 లక్షల వరకు దీని బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుందని భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు