ఐపీఎల్ 2020 : ఫాంలోకి వచ్చిన కోహ్లీ... బెంగుళూరుకు మరో విజయం

ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:15 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, ఈ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫాంలోకి వచ్చి అర్థ శతకం బాదాడు. దీంతో మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 
 
తొలుత టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. స్మిత్‌ నిర్ణయం తప్పని తేలేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. పవర్‌ ప్లే ముగియక ముందే బట్లర్‌ (22), స్మిత్‌ (5), శాంసన్‌ (4) పెవిలియన్‌ చేరిపోయారు. దీంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ ఇక ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. 
 
లోమ్రర్‌ క్రీజులో కుదురుకోగా.. ఊతప్ప (17) పెద్ద గా ఆకట్టుకోలేకపోయాడు. రియాన్‌ పరాగ్‌ (16) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. చాహల్‌ తన స్పిన్‌తో రాయల్స్‌ను కట్టిపడేశాడు. ఆఖర్లో తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్‌), ఆర్చర్‌ (10 బంతుల్లో 16 నాటౌట్‌) కొన్ని విలువైన పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ 3, ఉడాన 2 వికెట్లు పడగొట్టారు. 
 
అనంతరం లక్ష్యఛేదనలో కోహ్లీ సేన 19.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసింది. కోహ్లీ (53 బంతుల్లో 72 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్థసెంచరీ సాధించగా.. దేవదత్‌ పడిక్కల్‌ (45 బంతుల్లో 63, 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) లీగ్‌లో మూడో అర్థశతకం సాధించాడు. యుజ్వేంద్ర చాహల్‌ (3/24)కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు దక్కింది. 
 
ప్రత్యర్థి జట్టు ఉంచిన లక్ష్యం పెద్దది కాకపోవడంతో బెంగళూరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగింది. ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ (8) ఆరంభంలోనే ఔటైనా.. పడిక్కల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో బాదే బాధ్యత పడిక్కల్‌ తీసుకోగా, క్రీజులో కుదురుకున్నాక కోహ్లీ బ్యాట్‌కు పనిచెప్పాడు. 
 
గత మూడు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కోహ్ల ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఈ క్రమంలో పడిక్కల్‌ 34 బంతుల్లో అర్థశతకం సాధించగా.. కోహ్లీ 41 బంతుల్లో మైలురాయిని దాటాడు. రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించాక పడిక్కల్‌ ఔటైనా.. ఏబీ డివిలియర్స్‌ (12 నాటౌట్‌)తో కలిసి విరాట్‌ మిగిలిన పని పూర్తిచేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు