రిలయన్స్ జియో మరో సంచలనం.. జియో మీట్ పేరిట కొత్త యాప్

శుక్రవారం, 1 మే 2020 (17:19 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం కొత్త వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ని లాంఛ్ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్‌డౌన్‌ పరిస్థితులను సరిగ్గా క్యాష్ చేసుకునేందుకు జియో కొత్త వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ని లాంచ్ చేసింది.

రిలయన్స్ జియో తన ప్లాట్ ఫాం మీద జియో మీట్‌ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అత్యవసరంగా మారిన వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలలోకి ప్రవేశించింది. ఫలితంగా  జూమ్, గూగుల్ మీట్, హౌస్‌పార్టీ లాంటి యాప్‌లకు గట్టి షాక్ ఇచ్చింది.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా జియోమీట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. జియో మీట్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని, ఇది ఏ పరికరంలోనైనా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌‌లో నైనా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ తెలిపారు.
 
జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్‌ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి జియోమీట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు