లైకుల కోసం ఆస్పత్రిలో రీల్స్ చేసిన వైద్య విద్యార్థులకు షాక్.. ఎక్కడ?

ఠాగూర్

ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (11:08 IST)
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వినియోగం బాగా పెరిగిపోయింది. కొంతమంది యువతతో పాటు సినీ ప్రముఖులు తమ పాపులారిటీని పెంచుకునేందుకు వీలుగా తాము ఎక్కడ ఉన్నామో.. ఏం చేస్తున్నామనే విషయాన్ని మరిచిపోయి సెల్ఫీలు, వీడియోలతో హల్చల్ సృష్టిస్తున్నారు. తాజాగా కొందరు వైద్య విద్యార్థుల లైకుల కోసం ఆస్పత్రిలో రీల్స్ చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. దీంతో ఆ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. 
 
ఆసుపత్రి యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. గడగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో చదువుతున్న 38 మంది విద్యార్థుల ట్రైనింగ్‌ మరో 20 రోజుల్లో ముగియనుంది. త్వరలో కళాశాలలో జరగనున్న ప్రీ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం కోసం ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రిలోనే రీల్స్‌ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. విద్యార్థుల చర్యపై జీఐఎమ్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
'ఆసుపత్రిలో రీల్స్‌ చేసేందుకు యాజమాన్యం విద్యార్థులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. వాటిని మేము ప్రోత్సహించం. వారు ఏం చేయాలనుకున్నా రోగులకు ఇబ్బంది కలగకుండా.. ఆసుపత్రి వెలుపల చేయాలి. నిబంధనలు ఉల్లంఘించి ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. వారికి జరిమానాతో పాటు.. ట్రైనింగ్‌ను మరో 10 రోజులు పొడిగించాం' అని డైరెక్టర్ డాక్టర్‌ బసవరాజ్‌ పేర్కొన్నారు. ఇటీవల చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో ఓ వైద్యుడు ఆపరేషన్‌ గదిలో తన ప్రీవెడ్డింగ్‌ షూట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడిని తక్షణమే సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు