విదేశీ ఎంబసీలకు బికనేరీ లడ్డూలు - నగర శైలిలో మహాద్భుత నిర్మాణం

శుక్రవారం, 31 జులై 2020 (17:02 IST)
కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. శ్రీరాముడు జన్మస్థావరంగా భావించే అయోధ్యలో రామమందరి నిర్మాణం జరుగనుంది. ఇందుకోసం భూమి పూజా కార్యక్రమం ఆగస్టు 5వ తేదీన చేపట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. పైగా, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 
 
ఇందులో భాగంగానే ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు 'బికనేరీ లడ్డూల'ను బహూకరించాలని ట్రస్టు నిర్ణయించుకుంది. అంతేకాకుండా అయోధ్యలో కూడా లడ్డూలను పంచి పెట్టాలని ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ఒక్కో ప్యాకెట్‌లో నాలుగు లడ్డుల చొప్పున ఉంటాయని ట్రస్ట్ పేర్కొంది. అలా.. పంపిణీ నిమిత్తమై 4 లక్షల లడ్డూల ప్యాకెట్లను సిద్ధం చేశారు. 
 
ఆగస్టు 5వ తేదీన జరగబోయే భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న విషయం తెలిసిందే. వీరితో పాటు రామ మందిర కర సేవలో భాగస్వాములైన అద్వానీ, ఉమా భారతికి కూడా ట్రస్టు ఆహ్వానాలు పంపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్యకు చేరుకొని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. 
 
ఇదిలావుంటే, అయోధ్య రామ మందిర నిర్మాణం నగర శైలిలో మహాద్భుతంగా ఉంటుందని వాస్తు శిల్పి చంద్రకాంత్ సోంపుర వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అంతకుముందటి ప్లాన్‌ను సవరించినట్లు తెలిపారు. అంతకుముందు ప్లాన్ ప్రకారం పేర్కొన్నదాని కన్నా రెట్టింపు విస్తీర్ణంలో రామాలయాన్ని నగర శైలిలో నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆర్కిటెక్ట్ అయిన చంద్రకాంత్ స్పందిస్తూ, గతంలో రూపొందించిన ప్లాన్ కన్నా రెట్టింపు పరిమాణంలో రామాలయాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. 5 గుమ్మటాలు, ఒక శిఖరంతో నిర్మితమయ్యే ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు మూడేళ్లలో రామాలయం భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు