ఢిల్లీలో దీపావళి టపాసులపై నిషేధం

శుక్రవారం, 6 నవంబరు 2020 (09:13 IST)
కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీపావళి సమీపిస్తున్న వేళ.. టపాసులపై నిషేధాన్ని విధిస్తూ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. నగరంలో కరోనా పరిస్థితి, సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమీక్షించారు.

అనంతరం ఆ నిర్ణయాలను ట్విట్టర్‌లో వెల్లడించారు. దీపావళి రోజున ఢిల్లీ ప్రజలెవ్వరూ టపాసులు కాల్చకూడదు అని పిలుపునిచ్చారు. గతేడాదిలానే ఈసారి కూడా టపాసులను కాల్చకుండానే దీపావళి జరుపుకుందామని సిఎం అన్నారు. నగరంలో వాయుకాలుష్యం, కరోనా వైరస్‌ నేపథ్యంలో టపాసులు కాల్చడం వల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుందన్నారు.

ఢిల్లీలో పొగ కారణంగా సంభవించే మరణాలకు ఇదే ఆఖరు కావాలని ఆకాంక్షించారు. నగరంలో వైద్య సదుపాయాలను మరింతగా మెరుగుపరచడంతోపాటు ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌, ఐసియు పడకలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐసియు పడకల పెంపునకు సంబంధించి తమ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిందని, దీనిపై సుప్రీం కోర్టులో రేపు అప్పీల్‌కు వెళతామన్నారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఈ స్టే ను ఎత్తివేస్తుందని భావిస్తున్నామన్నారు. కరోనా పరీక్షలపై మరింత దృష్టి పెట్టాలని, కేసులు పెరుగుతున్నా మరణాల రేటు పెరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు.. దీపావళి రోజున బెంగాల్‌లో బాణసంచాను కాల్చడంపై కోల్‌కతా హైకోర్టు నిషేధాన్ని విధించింది. బాణసంచా విక్రయం, కాల్చడంపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలను జారీ చేసింది.
 
దీపావళికి అందరం  లక్ష్మీపూజ జరుపుకుందాం
కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది దీపావళి రోజున ఎవ్వరూ బాణసంచాను కాల్చకూడదని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈసారి లక్ష్మీపూజ నిర్వహిస్తామని, అందరూ కలిసి దీపావళిని జరుపుకుందాం అని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.

దీపావళి (నవంబర్‌ 14) రోజున రాత్రి 7.39 గంటలకు రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజలంతా తమ ఇళ్లల్లో టీవీ ల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని వీక్షించాలని, తమ కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొనాలని కేజ్రీవాల్‌ ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు