మద్యం కోసం క్వారంటైన్ నుంచి కరోనా రోగి పరార్

గురువారం, 25 జూన్ 2020 (14:55 IST)
కరోనా వైరస్ బారినపడిన అనేక మంది రోగులు గుక్కెడు మద్యం లేక తల్లడిల్లిపోతున్నారు. ఈ మద్యం కోసం క్వారంటైన్ కేంద్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పారిపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ కరోనా రోగి బెంగుళూరు ఆస్పత్రి నుంచి మద్యం కోసం పారిపోయిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి జూన్ 19వ తేదీన త‌న స్నేహితుడిని(19) క‌త్తితో పొడిచి చంపాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా కొవిడ్-19 ప‌రీక్ష‌లు చేయించారు. ఈ ప‌రీక్ష‌ల్లో అత‌నికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. 
 
ఈ క్ర‌మంలో నిందితుడిని బెంగ‌ళూరులోని విక్టోరియా ఆస్ప‌త్రిలో మంగ‌ళ‌వారం చేర్పించారు. బుధ‌వారం ఉద‌యం అత‌నికి చేతికి గాయం కావ‌డంతో, వేరే వార్డుకు త‌ర‌లించి చికిత్స చేసేందుకు న‌ర్సు సిద్ధ‌మ‌వుతోంది. ఇదే అదునుగా భావించిన నిందిత‌డు.. అక్క‌డున్న న‌ర్సులు, సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి ఆస్ప‌త్రి నుంచి పారిపోయాడు. 
 
అంత‌కుముందే త‌న స్నేహితుడికి ఫోన్ చేసి త‌న‌కు మ‌ద్యం కావాల‌ని కోరాడు. నిందితుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు స్నేహితుడికి తెలిసిన‌ప్ప‌టికీ.. మ‌ద్యం కోసం పుష్పాంజ‌లి థియేట‌ర్ వ‌ద్ద‌కు చేరుకున్నాడు. అంత‌లోపే ఆస్ప‌త్రి సిబ్బంది, పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. నిందితుడితో పాటు అత‌ని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు