పెళ్లయిన రెండు రోజులకే వరుడు మృతి - 95 మందికి కరోనా

మంగళవారం, 30 జూన్ 2020 (11:55 IST)
బీహార్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. వివాహమైన రెండు రోజులకే పెళ్లి కుమారుడు కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. అలాగే, ఈ పెళ్లికి హాజరైన 95 మందికి ఈ వైరస్ సోకింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ పట్టణంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దీహపాలికి గ్రామానికి చెందిన యువకుడు గురుగ్రామ్‌లో (30) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెళ్లి కోసం మే 12న గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు కరోనా బారినపడినా గుర్తించలేకపోయాడు. 
 
పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ నెల 15న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండు రోజులకే వరుడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. అయితే, కరోనా పరీక్షలు చేయించకుండానే వరుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఈ విషయం తెలిసిన అధికారులు వివాహానికి హాజరైన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 95 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. వధువుకు మాత్రం పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినట్టు అధికారులు తెలిపారు. బాధితులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. పెళ్లికి 50 మందికి మాత్రమే అనుమతి ఉండగా అంతకుమించి హాజరైనట్టు అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు