విమానంలో రక్తపు వాంతి చేసుకుని ప్రయాణికుడి మృతి

మంగళవారం, 22 ఆగస్టు 2023 (11:52 IST)
విమాన ప్రయాణంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతి చేసుకుని ప్రాణాలు విడిచాడు. ముంబై నుంచి రాంచీకి వెళుతున్న ఇండిగో విమానంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీంతో ఆ విమానాన్ని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా కిందకు దించేసి.. బాధితుడిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ప్రయాణికుడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. బాధితుడు సీకేడీ, ట్యూబరిక్యులోసిస్‌తో బాధపడుతున్నట్టు సమాచారం.
 
సోమవారం సాయంత్రం ముంబై నుంచి రాంచీకి ఇండిగో విమాన ఒకటి బయలుదేరింది. ఇందులో 62 యేళ్ల ప్రయాణికుడు ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. రక్తపు వాంతి చేసుకున్నాడు. దీంతో పైలెట్ విమానాన్ని నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఎయిర్ పోర్టు నుంచి బాధితుడిని సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ విషయాన్ని కిమ్స్ ఆస్పత్రి బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్ శాఖ డీజీఎం ఎజాష్ షామీ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు