అమ్మాయిల వివాహ వయసు పెంపు

శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:36 IST)
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మహిళా, శిశు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించారు. మహిళా,శిశు సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ చెప్పారు.

ముఖ్యంగా తాము తీసుకువచ్చిన బేటీ బచావ్, బేటీ పడావ్ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలపై కేంద్ర బడ్జెట్ 2020లో రూ.28,600 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రతిపాదించారు.
 
ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం కోసం ప్రవేశ నమోదులో అబ్బాయిలకన్నా అమ్మాయిలే ఎక్కువగా నమోదు చేసుకన్నారని ఆమె చెప్పారు. బాలికలు ముందు వరసలో ఉన్నారని.. బాలురకన్నా 5శాతం ఎక్కువ ఉన్నారని  చెప్పారు.
 
అలాగే పౌష్టికాహారం, ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లల ఆరోగ్యం కోసం భారీ నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కీలకమైన అంశాన్ని మంత్రి ప్రతిపాదించారు. దేశంలో మహిళ వివాహం చేసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు కాగా ఇప్పుడు ఆ వయసును పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
 
అయితే దీనిపై సమగ్రమైన అధ్యయనం జరగాలని, అందుకోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వచ్చే ఆరునెలల్లో ఈ టాస్క్ ఫోర్స్ తన నివేదికను అందిస్తుందని చెప్పారు.
 
6లక్షల మందికి అంగన్ వాడీలకు సెల్ ఫోన్లు అందిస్తామని చెప్పారు. పౌష్టికాహారం, ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నట్లు చెప్పారు. 2020-21కి న్యూట్రీషన్ సంబంధిత కార్యక్రమాలకు రూ.35,600 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 6నెలల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు