శుభవార్త చెప్పిన యడ్యూరప్ప : ఇకపై బెంగుళూరు వెళ్లాలంటే...

మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:07 IST)
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఇతర రాష్ట్రాల ప్రజలకు శుభవార్త చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు ఇకపై 15 రోజుల పాటు క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, కరోనా లక్షణాలతో బాధపడేవారు మాత్రం ముందుజాగ్రత్తగా పరీక్షలు చేయించుకుని, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. ఇదే అంశంపై కర్నాటక ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
ఇకనుంచి ప్రయాణ ఆంక్షలను సులభతరం చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఆంక్షల సడలింపుల్లో భాగంగా అంతరాష్ట్ర రాకపోకలపై ఇప్పటివరకూ విధించిన నిబంధనలను కర్ణాటక ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో.. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక వెళ్లేవారు కరోనా లక్షణాలు లేని పక్షంలో ఇకపై 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. 
 
లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్‌లో ఉండి ఆప్తమిత్ర హెల్త్‌‌లైన్‌ నంబర్ 14410కి ఫోన్ చేయడం ద్వారాగానీ, వైద్యులను సంప్రదించిగానీ చికిత్స పొందాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు, ఇప్పటివరకూ ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వెళ్లేవారు సేవా సింధు పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉండేది. ఇకపై.. సేవా సింధు పోర్టల్‌లో వివరాలు నమోదు చేయనక్కర్లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది. 
 
బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వచ్చేవారికి ఇప్పటివరకూ తప్పనిసరిగా చేసిన కరోనా టెస్టులను కూడా ఇకపై చేసేది లేదని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పటివరకూ అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన ఆంక్షలను కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. లక్షణాలు ఉన్నవారు అప్రమత్తంగా వ్యవహరించి ఎవరికి వారు టెస్టులు చేసుకోవాలని సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు