మే 31 తర్వాత ఏంటి? ప్రధాని మోడీతో అమిత్ షా భేటీ!

శుక్రవారం, 29 మే 2020 (16:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని 7 కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ నెల 31న లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్ ఐదో దశ విధించాలా వద్దా అనే విషయంపై చర్చించినట్టు సమాచారం. 
 
అదేసమయంలో లాక్డౌన్ ఎత్తివేస్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇద్దరు నేతలూ చర్చించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ తరుణంలో కరోనా తీవ్రంగా ఉన్న జోన్లలోనే లాక్‌డౌన్ కొనసాగిస్తూ మిగతా చోట్ల ఎత్తివేసి విషయంపైన, కరోనా తీవ్రత ఉన్న చోట్ల కట్టడి చేస్తూ లేని ప్రాంతాల్లో మరింత వెసులుబాటు ఇచ్చే అవకాశంపైనా చర్చించినట్టు సమాచారం. 
 
మరోవైపు చైనాతో వివాదాలపై కూడా మోడీ, షా చర్చించినట్లు సమాచారం. తాజా పరిణామాలపై ఇద్దరు నేతలూ చర్చించారని తెలిసింది. మూడు వారాలుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. యుద్ధానికి సై అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. చైనాను అదుపుచేసేందుకు తీసుకుంటోన్న చర్యలపై మోడీ, షా చర్చించారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు