సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ : రాష్ట్రపతి ఉత్తర్వులు

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:36 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించగా, ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు సీజేగా 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
 
సుప్రీంకోర్టులో జస్టిస్‌ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కావడం గమనార్హం. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన 1983లో న్యాయవాద వృత్తి చేపట్టి ప్రాక్టీసు మొదలుపెట్టారు. 
 
2000 సంవత్సరం జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఈనెల 24న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు