నిరాడంబరత - సత్‌ప్రవర్తనకు ప్రతిరూపం ప్రణబ్ : రాజ్‌నాథ్ సింగ్

సోమవారం, 31 ఆగస్టు 2020 (18:24 IST)
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు. ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత మెదడుకు సర్జరీ జరిగింది. ఈ సర్జరీ నుంచి ఆయన కోలుకోలేక డీప్ కోమాలోకి వెళ్లిపోయారు. అయితే, ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్య బృందం చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలో సోమవారం ఆయన తుదిశ్వాస విడిచినట్టు ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ఇదిలావుండగా, ప్రణబ్ మృతి పట్ల కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అనేక దశాబ్దాలపాటు భారత దేశానికి విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరాడంబరత, నిజాయితీలకు ప్రతిరూపమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
 
ప్రణబ్ ముఖర్జీ దివంగతులు కావడం పట్ల రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిరాడంబరత, నిజాయితీ, సత్ప్రవర్తనలకు ప్రతిరూపం ప్రణబ్ ముఖర్జీ అని పేర్కొన్నారు. ఆయన మన దేశానికి అంకితభావంతో, శ్రద్ధాసక్తులతో సేవ చేశారన్నారు. ఆయన ప్రజా జీవితంలో చేసిన సేవలు, కృషి అమూల్యమైనవని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు