కేంద్ర సర్వీసుకి 73 మంది ఐఏఎస్‌ల ఎంపిక

గురువారం, 10 అక్టోబరు 2019 (09:06 IST)
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నిమిత్తం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 73 మంది ఐఎఎస్‌ అధికారులను సిబ్బంది వ్యవహారాల శాఖ ఎంపిక (ఎంప్యానెల్‌) చేసింది.

వీరిలో 32 మందిని కార్యదర్శి హోదాకు, 41 మందిని అదనపు కార్యదర్శి హోదాలోనూ తీసుకునేందుకు ఎంప్యానెల్‌ చేశారు. అయితే వీరిని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్స్‌ తప్పనిసరి. సదరు అధికారి సమ్మతీ కీలకాంశమే. కార్యదర్శి కోసం ఎంప్యానెల్‌ అయిన వారిలో జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు.

కశ్మీర్‌ విభజనకు ముందు కేంద్రం ఆయనను ఛత్తీ్‌సగఢ్‌ నుంచి శ్రీనగర్‌కు పంపింది. చత్తీస్‌గఢ్‌ కేడర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం జన్మతః తెలుగువారు. ఆయనను హోం శాఖలోకి తీసుకోవచ్చని వినిపిస్తోంది. కాగా- తెలంగాణకు చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులు అరవింద్‌ కుమార్‌, అశోక్‌ కుమార్‌లనూ అదనపు కార్యదర్శి హోదాలోకి ఎంప్యానెల్‌ చేశారు.

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధాన రూపకల్పనతో పాటు కీలక విధాన నిర్ణయాల్లో అరవింద్‌ కుమార్‌ క్రియాశీల పాత్ర పోషించారు. అశోక్‌ కుమార్‌ ఈ ఏడాది జనవరిలో నేషనల్‌ వాటర్‌ మిషన్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈఇద్దరూ 1991 బ్యాచ్‌ వారే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు