నా కుమార్తె తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదు.. సౌందర్య తండ్రి

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (12:08 IST)
తమిళనాడు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ప్రభు అనే ఎమ్మెల్యే ఇటీవల కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన ఈయన... బ్రాహ్మణ కులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది ఇపుడు పెద్ద రచ్చగా మారింది. యువతి తండ్రి స్వామినాథన్ కోర్టుకెక్కాడు. తన కుమార్తె సౌందర్యను ఎమ్మెల్యే తన అధికార బలంతో కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడంటూ అందులో పేర్కొన్నాడు. పైగా, తన కుమార్తె తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు ఏమాత్రం ఇష్టంలేదని చెప్పుకొచ్చాడు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... సౌందర్యను కోర్టులో ప్రవేశపెట్టాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. 
 
ఈ కోర్టు ఆదేశాలపై ఎమ్మెల్యే వరుడు ప్రభు స్పందించారు. తన భార్యను నేడు కోర్టు ముందు హాజరు పరిచేందుకు సిద్ధంగా ఉన్నానని, తన మామయ్యతో మాట్లాడాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా, ఆయన వినిపించుకోవడం లేదని అన్నారు. తామిద్దరమూ మేజర్లమని, ప్రేమించుకున్నామని చెప్పిన ఆయన, అనవసరంగా స్వామినాథన్ ఈ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను శిరసావహించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. 
 
మరోవైపు, వధువు సౌందర్య సైతం భర్తకు అండగా ఉంది. తాను ఇష్టపూర్వకంగానే ప్రభును వివాహం చేసుకున్నాననీ, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేని ప్రకటించింది. కాగా, సౌందర్య తండ్రి స్వామినాథన్ త్యాగదుర్గం మలయమ్మన్ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు