శోభనం ఏర్పాటు చేస్తే బహిర్భూమికి వెళ్లాలన్న ఇద్దరు వధువులు, అత్త తిరిగొచ్చేసరికి పరార్

గురువారం, 26 నవంబరు 2020 (11:12 IST)
ఎన్నాళ్లగానో తమ కొడుకులకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ఓ మధ్యవర్తి ద్వారా మీ అబ్బాయిలకు సరైన జోడీల్లాంటి అక్కాచెల్లెళ్లు వున్నారంటూ తెలుసుకుని ఎగిరి గంతేసారు. అమ్మాయిలను చూసిన అబ్బాయిల తల్లిదండ్రులు సంబరిపడిపోయారు. పెళ్లి కుదిర్చిన మధ్యవర్తికి లక్ష రూపాయలు నజరానా కూడా ఇచ్చారు. ఐతే పెళ్లి తంతు ముగిసి శోభనం ఏర్పాటు చేసిన గంటకే ఇద్దరు వధువులు పారిపోయారు. వాళ్లు అలా ఎందుకు చేసారు? వివరాలు ఇలా వున్నాయి.
 
ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమారులున్నారు. వీరి పెళ్లి చేసేందుకు సదరు వ్యక్తి గత కొన్ని రోజులుగా ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మీ కుమారులకు తగిన వధువులు వున్నారనీ, ఇద్దరూ అక్కాచెల్లెళ్లే అంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన సదరు వ్యక్తి ముహూర్తం ఖాయం చేసాడు. కట్నంగా చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు సరికదా వధువులకు భారీగా నగలు చేయించి వేశారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అత్తారింటిలో శోభనం ముహూర్తం నిర్ణయించారు.
 
మరో గంటలో శోభనం జరుగుతుంది అనగా, తాము బహిర్భూమికి వెళ్తామన్నారు ఇద్దరు కోడళ్లు. దీనితో అత్త స్వయంగా కోడళ్లినద్దరినీ వెంటబెట్టుకుని సమీపంలో వున్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లింది. ఐతే తమకు నీళ్లు చాల్లేదనీ, మరికాసిని నీళ్లు బకెట్టుతో తీసుకురావాలని కోడళ్లు కోరారు.
 
సరేనంటూ అత్త నీళ్ల కోసం వెళ్లి తిరిగి వచ్చేసరికి కోడళ్లిద్దరూ కనిపించకుండా పోయారు. దీనితో భయపడిపోయిన అత్త ఇంటికెళ్లి సమాచారం అందించింది. ఐతే వాళ్లను ఎవరూ కిడ్నాప్ చేయలేదనీ, పథకం ప్రకారమే ఓ వాహనాన్ని ఏర్పాటు చేసుకుని వంటి మీద వున్న నగలతో సహా పరారైనట్లు తేలింది. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు