ఏపీ భవన్‌లో అత్యంత వైభవోపేతంగా దశరా మహోత్సవాలు

గురువారం, 11 అక్టోబరు 2018 (21:13 IST)
న్యూఢిల్లీ: దశరా మహోత్సవాలను పురస్కరించుకుని న్యూఢిల్లీ లోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి బుధవారం నుంచి మొదలైన నవరాత్రి ఉత్సవాలలో ఢిల్లీలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా తెలుగువారు విశేషంగా పాల్గొనటం ఎంతో సంతోషదాయకం అని ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ తన ఆనందాన్ని వెలిబుచ్చారు.
 
10వ తేదీ బుధవారం అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవిగాను, 11వ తేది గురువారం శ్రీ బాలాత్రిపుర సుందరీదేవీగా దర్శనమిచ్చారు.  భక్తులు ఈ రెండు రోజులు ప్రత్యేకించి స్త్రీలు అమ్మవారి సహస్రనామ కుంకుమార్చనలో ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించి ఇంతటి మంచి కార్యక్రమాలను ఎపి భవన్ నిర్వహిస్తున్నందులకు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
 
12-10-2018 శుక్రవారం శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమియ్యనున్నారని, అమ్మవారికి ఉదయం గం.8.00లకు స్నపనాభిషేకం జరుగుతుందని తదనంతరం గం.10.00కు సామూహిక కుంకుమార్చన, మధ్యాహ్నం గం.12.00కు పంచహారతులు, నక్షత్ర హారతులు, మహాప్రసాదం వితరణ ఉంటాయని తెలిపారు. 
 
సాయంత్రం గం.6.30కు సామూహిక కుంకుమార్చన, రాత్రి గం.8.30కు పంచహారతులు, నక్షత్ర హారతులు, మహాప్రసాదం వితరణ వుంటాయని, భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ దుర్గామాత కృపాకటాక్షములు పొందవలసినదిగా రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. సామూహిక కుంకుమార్చనల కొరకు ప్రత్యేకంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నుంచి తెప్పించబడిన అమ్మవారి డాలర్లకు పూజలు చేయించడం ఎంతో విశేషమని భక్తులు కొనియాడారు. ఈనెల 18వ తేదీ వరకూ నిత్యం జరిగే విశేష పూజలకు తామే కాకుండా వారివారి మిత్రులను కూడా తీసుకొనిరావలసినదిగా ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు