భద్రాద్రి రామునికి కొత్త తలనొప్పి.. 'శ్రీరామచంద్ర' పదానికి బదులుగా 'రామనారాయణ'!

బుధవారం, 22 జులై 2020 (19:05 IST)
Lord Rama
భద్రాచలం.. దక్షిణ అయోధ్యగా భావిస్తారు. వనవాస సమయంలో ఇక్కడి దండకారణ్యంలో సీతారామలక్ష్మణులు నడయాడారని, భద్రగిరిపై కొద్దికాలం నివసించారని, ఇక్కడికి సమీపంలోని గోదావరి ఒడ్డునే పర్ణశాల నిర్మించుకున్నారన్న విశ్వాసం ఉంది. ఇది కోట్లాది మంది నమ్మకాలకు సంబంధించిన విషయం. ఇక రామదాసు ఇక్కడ దేవాలయం నిర్మించిన దగ్గరి నుంచి సీతారాముల కళ్యాణం జరిపించడం ఏటా ఓ అధికారిక కార్యక్రమంగా మారింది. పెళ్లయిన దంపతులు తప్పనిసరిగా సీతారాముల కళ్యాణం చూడాలన్న విశ్వాసం ఇక్కడ ప్రబలంగా ఉంది. 
 
ఏటా జరిగే ఈ సీతారాముల కళ్యాణానికి తెలుగు రాష్ట్రాలతో బాటు ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ సందర్భంలో సీతారాముల గోత్రనామాలు, ప్రవరలు చెప్పే సమయంలో పలికే పదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడి అర్చకగణం 'శ్రీరామచంద్ర' పదానికి బదులుగా 'రామనారాయణ' పదాన్ని చెబుతున్నారని.. ఇది తీవ్రమైన అభ్యంతరకరమన్నది భద్రాద్రి పరిరక్షణ సమితి మాట.
 
వాస్తవానికి సీతారామునికి.. 'భద్రాద్రి రాముడు'.. చతుర్బుజ రాముడు'.. 'వైకుంఠ రాముడు'.. 'ఓంకార రాముడు'.. 'రామనారాయణుడు' అనే పేర్లు ఉండగా కేవలం 'రామనారాయణ' శబ్దాన్నే ఉపయోగించడం వెనుక ఆధ్యాత్మికపరమైన కుట్రపూరిత దాడి ఉందన్నది వీరి మాట. 'భద్రాద్రి రామనే వరాయ' అని చెప్పాల్సిన ప్రవరలను 'రామనారాయణే వరాయ' అని పలకడం పట్ల తమకు తీవ్రమైన అభ్యంతరం ఉందన్నది ఈ సమితి మాట. 
 
దీని వెనుక జీయర్ల ప్రభావం ఉందని, ఇలాంటి వైఖరి సరికాదని సమితి చెప్తోంది. కోట్లాది భక్తుల విశ్వాసాలతో చెలగాటం ఆడడం సరికాదని భద్రాద్రి పరిరక్షణ సమితి చెబుకోంది. రామచంద్రుడు అన్న పిలుపులో చంద్ర పదం శివగణానికి చెందినదని, అందుకోసమే ఈ పదానికి శైవాన్ని ఆపాదించడం సమంజసం కాదంటున్నారు. 
 
ఇలా వందల ఏళ్లుగా అందరి దేవునిగా ఉన్న సీతారామచంద్రుణ్ని కొందరివాడిగా మార్చే ప్రయత్నాన్ని తాము ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, దీనికోసం అటు చట్టపరంగానూ, ఇటు ప్రజా చైతన్యం ద్వారా ఎదర్కొంటామని భద్రాద్రి పరిరక్షణ సమితి ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం త్వరలో సమసిపోవాలని భక్తులు ఆశిస్తున్నారు. భద్రాద్రి రాముడు ఈ వివాదానికి తప్పకుండా ఫుల్ స్టాప్ పెడతాని భక్తులు విశ్వసిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు