విష్ణుమూర్తికి పరమేశ్వరుడు దాస్యం... ఎప్పుడు? ఎలా? (video)

మంగళవారం, 16 జూన్ 2020 (21:02 IST)
ఆంజనేయుని చరితము పరమ పావనం. వినేందుకు ముదావహముగా వుంటుంది. నుండును. సకల కల్మషహరము. సమస్త కామనలను సఫలమొనర్చును. ఆంజనేయుని అవతారమునకు కారణములు అనేకములు. ఇప్పుడు మనము ఒక కారణము తెలుసుకొందాము.
 
పూర్వం వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు మిక్కిలి భక్తితో శివుడును ఆరాధించెను. అతడి పూజకు పరవశించిన శివుడు వృకాసురుడికి అనేక వరములు ప్రసాదించాడు. అసురుడైన వృకాసురుడు దేవతలను, మునులను, ప్రజలను బాధించసాగాడు.
 
అతడి ఆగడాలను భరించలేని దేవతలు, మునులు శ్రీమన్నారాయణుని శరణు వేడిరి. అది వినిన నారాయణుడు దేవతలకు అభయమిచ్చినాడు. దేవతలారా వినండి... రేపు సూర్యస్తమయంకల్లా నా చక్రముతో అతనిని వధించెదను అని పలికిరి. వృకాసురునికి ఈ వృత్తాంతం తెలిసింది.
 
వెంటనే అసురుడు కైలాసనికి వెళ్ళి మహేశ్వరా, కరుణామయా, భోళాశంకరా శరణుశరణు అని వేడుకొనినాడు. అది వినిన శంకరుడు... వృకా నీకు ఏమి ఆపద సంభవించినది. ఎవరు వలన నీకు ఆపద సంభవించినది. వారు ఎంతటి వారైనాసరే వారి నుండి నిన్ను నేను రక్షిస్తాను అని అభయమిచ్చినాడు. అప్పుడు వృకుడిట్లనెను... దేవాది దేవదేవతలంతా కలసి విష్ణువును ప్రార్థించి నన్ను వధించవలయునని యాచించిరి. దానికాతడు రేపు సూర్యస్తమయములోగా నన్ను తన చక్రంతో వధిస్తానని మాటచ్చినాడు.
 
ఆ మాట విన్న శివుడు పట్టుదలతో ఇట్లనెను. అతను ఎవరైనాసరే నిన్ను నేను రక్షించెదను. నిర్భయుడవై యుండుము. ఇట్లుండగా హరి చక్రహస్తుడై వృకుని మీదకు వచ్చెను. అలా వచ్చిన మాధవునికి ఎదురుగా ఉమాపతి శూలఫాణి గావించి యుధ్ద భూమిన నిలిచెను. విష్ణువు శంకరునితో ఇలా పలికెను.
 
మహదేవా నీవు దుర్మార్గులకు ఆశ్రయ మొసంగుచున్నావు. ఈ వృకుడు పరమ దుర్మార్గుడు. దేవతులను, సాధువులను మిక్కిలి బాధించుచున్నాడు. వీనిని సూర్యాస్తమయంలోగా నా చక్రముచే వధించెదెను అని అన్నాడు. అందుకు శివుడు వానిని నీవు చంపజాలవు. నేను వానిని రక్షించితీరెదను అని శివుడు పలికెను. హరిహరాధులు ఒక ఒప్పందానికి
వచ్చిరి. ఈ యుద్ధంలో ఎవరు ఓడిన ఇంకొకరికి బానిసత్వం చెయ్యాలి అని యుద్ధానికి తలపడిరి.
 
ఆ భయంకర యుద్ధానికి భూమి, ఆకాశం దద్ధరిల్లి పోయాయి. వృక్షాలు సైతం వణికి పోయాయి. చివరకు విష్ణుచక్రం వృకాసూరుని వధించినది. తన పరాజయాన్ని తెలుసుకున్న శివుడు ఇట్లనెను. ఉపేంద్రా నేను ఓడిపోతిని, నేను శాశ్వతంగా నీకు సేవ చేసెదను.
 
అప్పుడు విష్ణు ఇలా అనెను. ఉమాపతీ నేను ఎల్లప్పుడు నిన్నూ ఆరాధించెదను... అలాంటి నేను నీతో సేవ ఎలా చేయించుకొందును.. ఐతే మహదేవా ఈ రూపంలో నేను నీతో సేవ చేయించుకోలేను. నేను రామావతారమెత్తదను. నీవు అప్పుడు ఆంజనేయుడవై నాకు దాస్యం చేసుకొందువు అని పలికాడు. అలా శ్రీ ఆంజనేయుడు శ్రీ పరమేశ్వరుని రూపమని పురాణాలలో చెప్పబడి వుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు