8 నుంచి తిరుమల శ్రీవారి - వేములవాడ రాజన్న దర్శనాలు

శుక్రవారం, 5 జూన్ 2020 (08:56 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనభాగ్యం ఈ నెల 8వ తేదీ నుంచి కల్పించనున్నారు. ఈ విషయాన్ని తితిదే ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో దర్శన విధివిధానాలపై చర్చించారు. 
 
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆగిపోయిన శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దర్శనాల ప్రారంభానికి అంగీకారం లభించడంతో దర్శనాల అమలుపై ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. మరోవైపు, శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకాలు గురువారం ప్రారంభమయ్యాయి. 
 
ఇదిలావుండగా, వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో 8వ తేదీ నుంచి భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఆలయ అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే పక్షంలో సోమవారం నుంచి గంటకు 200 మంది భక్తులకు స్వామివారి లఘుదర్శనం అవకాశం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 
 
కరోనా వైరస్‌ని యంత్రణలో భాగంగా మార్చి 19 నుంచి రాజన్న ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్‌ నిబంధనలను సడలించి జూన్‌ 8 నుంచి ప్రార్థనా మందిరాలలో భక్తులకు అనుమతించవచ్చని స్పష్టం చేయడంతో భక్తులు ఆలయంలోని కోడెమొక్కులు, దర్శనం క్యూలైన్లలో భౌతికదూరం పాటించే విధంగా దూరం దూరంగా డబ్బాలను గీశారు. 
 
భక్తులను దర్శనానికి అనుమతించే పక్షంలో కేవలం లఘుదర్శనంకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఆర్జిత సేవలకు ఇప్పట్లో అవకాశం ఉండబోదని తెలుస్తోంది. రాజన్న ఆలయంలో ప్రత్యేకమైన కోడెమొక్కు సమర్పణ, తలనీలాల సమర్పణతో పాటు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదని అధికారులు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు