శివుడికి నైవేద్యంగా పీతలు, ఎక్కడో తెలుసా?

శనివారం, 24 అక్టోబరు 2020 (20:24 IST)
మ‌న దేశం ఎన్నో చారిత్రక‌, పురాత‌న దేవాల‌యాల‌కు ప్రసిద్ధిగాంచింది. ఎన్నో శ‌తాబ్దాల క్రింద‌ట నిర్మించినా ఇప్ప‌టికీ చెక్కు చెద‌రని ఆల‌యాలతో పాటు స్థలపురాణం ప‌రంగా ఎంతో విశిష్ట‌త‌ను క‌లిగి ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయి. మరికొన్ని వాటి నిర్మాణం, ఆకృతి, ప్రాచీన‌త వంటి అంశాల కార‌ణంగా ప్రాచుర్యంలోకి వ‌చ్చాయి. అయితే గుజ‌రాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాల‌యం మాత్రం వీట‌న్నింటికీ భిన్న‌మైంది. ఎందుకంటే ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా బ్రతికి ఉన్న పీతలను సమర్పిస్తారు. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది, అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.
 
సూరత్ గుజరాత్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచ స్థాయి వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. క్రీ.శ. 9వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్ ప్రపంచ వస్త్ర, వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. సూరత్‌ను క్రీ.శ. 9వ శతాబ్దంలో సూర్యపూర్ అని పిలిచేవారట. ఆ తరువాత 12వ శతాబ్దంలో పార్శీలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. మొఘల్ వంశ రాజులు సూరత్‌ను ఎన్నో విధాలుగా అభివృద్ధిపరిచారు. వారిలో అక్బర్, జహంగీర్, ఔరంగజేబు కొందరు. బ్రిటీష్ వారి కాలంలో సూరత్ వ్యాపారం ప్రపంచం నలుమూలలకు పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాలతో నేరుగా వ్యాపారం జరిపేవారు.
 
ప్రపంచ మార్కెట్‌లోని అన్ని వజ్రాలు దాదాపు 90%కి పైగా ఇక్కడే కోసి మరగబెట్టుతారు. మన్నిక, నాణ్యమైన వజ్రాలకు సూరత్ పేరుగాంచినది. ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ది చెందినది. అందుకు నిదర్శనం గుజరాత్ సముద్రం తీరంలో ఉన్న శివాలయం. అలాగే సూరత్‌లో సబర్మతీ నదీ తీరంలోని గల్టేశ్వర్‌లో ఉన్న పురాతన శివాలయం. పిక్నిక్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందిన గల్టేశ్వర్, శివునికి అంకితం చేయబడిన ఆలయం. భక్తుల కోరికలను తీర్చడంలో శివుడు ముందు ఉంటాడని చాలా మంది నమ్ముతారు. 
 
శివుడిని నమ్మకంతో ఆరాధిస్తే ఎలాంటి కోరికలనైనా తీర్చగలడని విశ్వసిస్తారు. సూరత్‌లోని శివ భక్తులు కూడా అలాగే నమ్ముతున్నారు. ఉమ్రాలో రామ్‌నాథ్ శివ ఘేలా దేవాలయం ఉంది. ఇక్కడి మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం భక్తులకు ఉంది. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, పీతలను శివునికి సమర్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. తమ చెవులకు వచ్చే అనారోగ్యాలు నయమవుతాయని చెప్తున్నారు. ఇక్కడికి శివరాత్రి సందర్భంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి