మంత్రివర్గ విస్తరణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... రేపు హస్తినకు పయనం

సోమవారం, 18 డిశెంబరు 2023 (09:09 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలో 10 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా మరో ఏడుగురికి అవకాశం కల్పించవచ్చు. దీంతో ఆయన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఈ మలివిడత విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన పలువురు కాంగ్రెస్ పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించిన పిదవ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. 
 
అలాగే, త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు. అయినప్పటికీ నాంపల్లిలో పరాజయం పొందిన ఫిరోజాఖాన్ మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. 
 
అలాగే, నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్ ఖాన్‌కు అవకాశాలు ఉండవని సమాచారం. మల్కాజిగిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయనను మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. అంజన్ కుమార్ యాదవ్(ముషీరాబాద్), మధుయాస్కీ(ఎల్బీనగర్)లు కూడా ఎన్నికల్లో ఓడిపోయినా వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. 
 
షబ్బీర్ అలీ, అంజన్ కుమార్‌లకు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని వారి అనుచరులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్ సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ ఉంది. ఇద్దరూ ఢిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్ ధీమాతో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కూడా ప్రయత్నిస్తున్నారు. 
 
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక సీఎం వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవీ ఇవ్వకూడదని పార్టీ యోచిస్తున్నట్టు కూడా మరోపక్క ప్రచారం జరుగుతోంది. దాన్నే అమలు చేస్తే మాత్రం ఓటమి చెందిన వారికి మంత్రిపదవులు దక్కే అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు