చేతబడి చేశాడన్న అనుమానంతో టెక్కీని గదిలో బంధించి పెట్రోలు పోసి నిప్పు!

మంగళవారం, 24 నవంబరు 2020 (08:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాల మల్యాల మండలం బల్వంతాపూర్ శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. చేతబడి చేయించాడన్న అనుమానంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను గదిలో బంధించి సజీవదహనం చేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లగా, మృతుడి భార్య ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్తను కోల్పోయి ఉన్న తనను ఓదార్చేందుకు వచ్చిన టెక్కీని గదిలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, జగిత్యాలకు చెందిన విజయ్, కొండగట్టుకు 1.5 కిలోమీటర్ల దూరంలో మంజునాథ ఆలయాన్ని, దానిపక్కనే ఓ కుటీరాన్ని నిర్మించాడు. 12 రోజుల క్రితం అతడి తమ్ముడు జగన్ అనారోగ్యంతో మృతి చెందాడు.
 
జగన్ మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన అతడి బావ రాచర్ల పవన్ కుమార్ (38), భార్య కృష్ణవేణితో కలిసి సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో మంజునాథ ఆలయానికి చేరుకున్నాడు. 
 
అక్కడే ఉన్న జగన్ భార్య సుమలత.. పవన్‌ను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయింది. అతడే తన భర్తను చేతబడి చేయించడం ద్వారా చంపేసి ఉంటాడని అనుమానించింది. పవన్‌కుమార్‌ను పట్టుకుని లాక్కెళ్లి కుటీరంలోని ఓ గదిలో బంధించి పెట్రోలు పోసి నిప్పంటించింది.
 
అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడి భార్య కృష్ణవేణి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వారు ఘటనా స్థలానికి వచ్చి చూసే సరికే పవన్ కుమార్ విగతజీవుడిగా మారాడు. ఈ ఘటనలో మరికొందరి హస్తం కూడా ఉందని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు