ప్రేమకు నిరాకరించిందనీ ప్రేమోన్మాది కిరాతక చర్య

సోమవారం, 4 సెప్టెంబరు 2023 (10:43 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిన ఓ యువతి, ఆమె తమ్ముడిపై ప్రేమోన్మాది కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఆ ప్రేమ కిరాతకుడు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె తమ్ముడు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన ఆదివారం ఎల్బీ నగర్ పరిధిలోనీ ఆర్టీసీ కాలనీలో జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన గుండుమల్ల సురేందర్ గౌడ్, ఇందిరమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె సంఘవి (26) రామంతాపూర్ హోమియో కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. రెండో కుమారుడు పృథ్వీ (23) ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. సంఘవి, పృథ్వీ కొన్నాళ్లుగా ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. 
 
ఫరూక్నగర్ మండలం, నేరెళ్ల చెరువు గ్రామానికి చెందిన శివకుమార్ (26), సంఘవి షాద్‌నగర్‌లోని ఒకే పాఠశాలలో పదో తరగతి చదివారు. అప్పటి నుంచే శివకుమార్ ప్రేమ పేరుతో సంఘవిని వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు తిరస్కరించినా వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. సంఘవి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. డిగ్రీ పూర్తి చేసిన శివకుమార్.. రామంతాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. యువతిని ఇటీవల కలిసి ప్రేమ విషయాన్ని చెప్పగా, ఆమె గట్టిగా మందలించింది. పదేపదే తిరస్కరణకు గురైన శివకుమార్ ఆమెపై కక్ష పెంచుకొని, కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.
 
ఈ క్రమంలో సంఘవి చిరునామా తెలుసుకున్న నిందితుడు ఆదివారం.. కత్తి తీసుకుని ఆమె నివాసానికి వెళ్లాడు. సంఘవి సోదరుడు పృథ్వీ బయటకెళ్లడాన్ని గమనించి.. ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావించి కత్తితో బెదిరిస్తూ వాగ్వాదానికి దిగాడు. ఇదేసమయంలో పృథ్వీ ఇంట్లోకి వచ్చి.. తన సోదరిని బెదిరించడాన్ని చూసి శివకుమార్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆప్పటికే విచక్షణ కోల్పోయిన నిందితుడు.. పృధ్వీపై కత్తితో దాడికి దిగాడు. ఛాతీలో పొడిచాడు. అడ్డుకోబోయిన సంఘవి ముఖంపైనా దాడి చేశాడు. సంఘవి భయంతో ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. తీవ్ర రక్తస్రావంతో పృథ్వీ అక్కడి నుంచి తప్పించుకుని బయటి నుంచి తలుపు గడియపెట్టి.. రోడ్డు మీదకొచ్చి కుప్పకూలాడు.
 
యువతి కేకలను ఆలకించిన పక్కింటి మహిళ ఝాన్సీ పరుగున వచ్చారు. అప్పటికే యువతి సోదరుడు కత్తిపోట్లతో బయటకు వెళుతూ జరిగిన విషయాన్ని చెప్పాడు. అప్రమత్తమైన ఝాన్సీ ఓ కర్ర తీసుకుని గది ముందుకెళ్లి.. తలుపు కొట్టి.. సంఘవిని ఏమైనా చేస్తే అంతుచూస్తామని హెచ్చరించింది. దీంతో నిందితుడు యువతి గది తలుపులు పగలగొట్టే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 
 
ఈలోపే ఝాన్సీ చాకచాక్యంగా మరో ద్వారం గుండా యువతిని బయటకు తీసుకొచ్చారు. స్థానికులు పృథ్వీని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. మరణించినట్లు వైద్యులు తెలిపారు. యువతిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు